ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పడంపై రైతులు మండిపడుతున్నారు. విడతలవారీగా రుణమాఫీ చేస్తామని, అందరికీ మాఫీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని.. బ్యాంకులు, సొసైటీలు, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పనిగా పెట్టుకున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన తాము కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని, రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. తీరొక్క విధంగా నిరసనలు తెలిపినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఏమాత్రం కనికరం చూపడం లేదని, రుణమాఫీ కాకపోతే తమ అప్పులు ఎలా తీరుతాయని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. -నమస్తే నెట్వర్క్
రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా బ్యాంకు అధికారులు మాఫీ చేయడం లేదు. మొదటి, రెండో విడతల్లో ప్రకటన చేసి కొందరు రైతులకు మాత్రమే మాఫీ చేశారు. ప్రస్తుతానికి రూ.2 లక్షల రుణమాఫీ కోసం అర్హులైన రైతులు బ్యాంకులకు వెళితే పేర్లు, ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నాయి అని చెబుతూ అనవసర కారణాలు చెప్పి తిప్పి పంపిస్తున్నారు. అధికారులు ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి. వ్యవసాయ సీజన్ అయినందున ఇబ్బంది పెట్టకుండా వెంటనే రుణమాఫీ చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
-గుగులోతు భద్రునాయక్, రైతు, పాండురంగాపురం, పాల్వంచ మండలం
నేను ఆంధ్రా బ్యాంకులో రూ.1.60 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నేను తీసుకున్న రుణం మాఫీ అయ్యిందో.. లేదో.. తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళితే అధికారులు కాలేదన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే.. రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పడం లేదు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి కాయితాలు రాయించుకుని రా.. అని చెబుతున్నారు. సాగు చేసుకోవడానికి పంట భూముల వద్దకు వెళ్లాలో.. బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. అంతా గందరగోళంగా ఉంది.
-రెడ్డి వెంకటేశ్వరరావు, రైతు, జమ్మిగూడెం, అశ్వారావుపేట మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా చేయాలి. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగు పనులు చేసుకునే రైతులందరి రుణాలు మాఫీ చేసి వారిని ఆదుకోవాలి. విడతలవారీగా రుణమాఫీ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మనోవేదనకు గురవుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మాదిరిగా వ్యవసాయం పండుగలా సాగాలంటే.. ప్రస్తుత ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీతోపాటు రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా నిలవాలి. లేదంటే రైతుల పక్షాన నిలిచి రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.
-మూడ్ జయరాంనాయక్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకుడు, చుంచుపల్లి