దమ్మపేట రూరల్, నవంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం రాయితీ అందిస్తున్న పామాయిల్ మొక్కలను ఆంధ్రాకు తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని దమ్మపేట పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు. లారీ ఆంధ్రాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నట్లు రైతులు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, ఆళ్ల నాగేశ్వరరావు, వెంపటి లక్ష్మీనారాయణ తెలిపారు. దీనిపై దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేసి మొక్కలతోపాటు లారీని అప్పగించారు.
పోలీసులు లారీడ్రైవర్‌ను విచారించగా లారీని సత్తుపల్లి మండలంలోని మేడిశెట్టివారిపాలెం వద్ద రైతులు ఆపినట్లు చెప్పడంతో దమ్మపేట పోలీసులు లారీని సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఉదంతంపై ఆయిల్‌ఫెడ్ ఖమ్మం, అశ్వారావుపేట డివిజినల్ మేనేజర్ బాలకృష్ణ స్పందిస్తూ లారీలోని మొక్కలకు సంబంధించిన పేరుతో తాము డెలివరీ చలానా రాయలేదన్నారు. నకిలీ డెలివరీ చలానా తయారు చేసి అక్రమానికి పాల్పడిన వారిపై జనగాంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటువంటి మోసాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.