కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ కారేపల్లి, మే 31: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సంయుక్త కిషాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎంఎస్పీ జిరాక్స్ కాపీలను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలకు సరైన ధరలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరైందికాదన్నారు. స్వామినాధన్ కమిషన్ సిఫారు ప్రకారం ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ధరలు ప్రకటించాల్సి ఉండగా, నామమాత్రపు ఖర్చులను పరిగణలోకి తీసుకొని ఎంఎస్పీ నిర్ణయించడం దుర్మార్గపు చర్య అన్నారు. నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు ముద్దా భిక్షం, రాము, వెంకన్న, ధర్మ, కిషోర్, కల్లన్న పాల్గొన్నారు. ఖమ్మంజిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లి పంచాయతీలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మాస్‌లైన్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐకేఎంఎస్ ఖమ్మంజిల్లా కార్యదర్శి వై.ప్రకాష్, నాయకులు కోయల శ్రీను, కంచర్ల శ్రీనివాసరెడ్డి, వై.జానకి, కావేటి నాగేశ్వరరావు, ఆలెం చంద్రయ్య, మాస్‌లైన్ నాయకులు గుగులోత్ తేజానాయక్, ధరావత్ సక్రు, పులకాని సత్తిరెడ్డి, రావుల నాగయ్య పాల్గొన్నారు.