ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 10 : మార్కెట్లో సిండికేట్గా మారిన ప్రైవేటు వ్యాపారులు రైతులు పండించిన పెసర్లకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించినా ధర దక్కడం లేదని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గత నెల 31న ఖమ్మం, వైరా వ్యవసాయ మార్కెట్లలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పెసర్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యతను మార్క్ఫెడ్ అధికారులు డీసీఎంఎస్కు అప్పగించారు. రైతులు మార్కెట్కు తరలించే పెసర్లకు 12 శాతంలోపు తేమ ఉంటేనే మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేసే అవకాశం ఉండడం.. ఈ క్రమంలోనే ఖమ్మం మార్కెట్కు వారాంతపు సెలవులు రావడం.. భారీ వర్షాలు, వరదల కారణంగా అధికారులు జిల్లాలో సెలవులు ప్రకటించారు. వర్షాలతో రైతులు పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి క్రయవిక్రయాలు జరిగిన నాలుగైదు రోజుల్లో సైతం ఒక్క రైతు పంటను కూడా అధికారులు కొనలేకపోయారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రైతులు దాదాపు 15 వేల ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. దీంతో 40 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే నాటికి రైతులు మార్కెట్కు పంట ఉత్పత్తులను తీసుకురావడం ప్రారంభించారు.
ఈ ఏడాది పెసర పంటకు మద్దతు ధర క్వింటా రూ.8,682 చొప్పున ప్రకటించారు. అదే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.7,400 మించి ధర పెట్టడం లేదు. దీంతో సాగు రైతులు క్వింటా ఒక్కంటికి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ధర కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఏర్పాటైన ప్రత్యేక కొనుగోలు కేంద్రాల్లో సైతం రైతులకు లాభం జరగడం లేదు. కొర్రీలు పెడుతున్నారే తప్ప పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని రైతులు వాపోతున్నారు.
తీరా ఇంత దూరం పంట ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులు మళ్లీ ఇంటికి తీసుకెళ్లలేక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సంబంధిత అధికారులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిబంధనలు సవరించి పెసర్లను కొనుగోలు చేస్తారా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే.
జెండా ధరకు మార్క్ఫెడ్ కొనలేదు..
ఈ ఏడాది నాకున్న పదెకరాల్లో ఐదెకరాల్లో పెసర పంట సాగు చేశాను. తీరా చేతికొచ్చే సమయానికి వర్షాలు రావడంతో మూడెకరాల్లో పంట నేలపాలైంది. రెండెకరాల్లో మాత్రమే పంట మిగిలింది. చేతికొచ్చిన పెసర్లను అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చా. జెండాపాటలో తొలుత క్వింటాకు రూ.7,200 పలికింది. నేను తీసుకొచ్చిన పంటకు సైతం ఖరీదుదారులు క్వింటాకు రూ.7,200 ధర పెట్టారు. అయితే మార్క్ఫెడ్ అధికారులు పరిశీలించి తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి నా పంటను కొనలేదు. మార్క్ఫెడ్ అధికారులు పంటను కొంటే క్వింటా ఒక్కంటికి అదనంగా రూ.1,400 రాబడి వచ్చేది.
-సత్యనారాయణ, రైతు, అన్నవరం, కొణిజర్ల మండలం
తేమ శాతంపై వాతావరణ ప్రభావం
వాతావరణ ప్రభావం కారణంగానే పెసర్లలో తేమ శాతం పెరుగుతుంది. దీంతో పంటను కొనుగోలు చేయలేకపోతున్నాం. కొనుగోలు కేంద్రం ప్రారంభమైన తర్వాత మార్కెట్కు వరుస సెలవులు, ఆ తర్వాత వర్షాలు, వరదల కారణంగా సెలవు ఉండడంతో పంట యార్డుకు రాలేదు. క్రయవిక్రయాలు జరిగిన నాలుగైదు రోజుల్లో నాణ్యమైన పంట యార్డుకు రాలేదు. కనీసం తేమ శాతం 12-14 ఉన్నా కొనుగోలు చేస్తాం. బుధవారం నుంచి 14 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేసేందుకు యత్నిస్తాం. ఉష్ణోగ్రతలు పెరిగితే విరివిగా పెసర్లను కొనుగోలు చేస్తాం.
-సునీత, మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్