రఘునాథపాలెం, జూన్ 17 : వానకాలం సీజన్ ప్రారంభమైంది. రైతన్న అమ్మిన యాసంగి మక్కల డబ్బులు ఖాతాల్లో జమ చేయాలన్న సోయి కాంగ్రెస్ సర్కారుకు లేకపోయింది. ఓ పక్క యాసంగి సీజన్‌కు తెచ్చిన అప్పుల ఒత్తిడి.. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాల్సిన సమయం, వానకాలం వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుందామంటే రైతుల చేతిలో చల్లి గవ్వలేని పరిస్థితి. మొక్కజొన్న పంట విక్రయించి రెండునెలలు గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పైసలు రైతుల ఖాతాల్లో జమ చేయని వైనం. కాంగ్రెస్ సర్కారు తీరుతో మొక్కజొన్న రైతులు అయోమయం.. గందరగోళానికి గురవుతున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
రెండు నెలలైనా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మంజిల్లాలో మొత్తం రూ.795 కోట్ల విలువైన పంటకు గానూ ఇరవై శాతం రూ.150 కోట్లు విడుదల చేసింది. ఇంకా 40,306 మంది రైతులకు రూ.655 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వానకాలం సాగు పనులు ప్రారంభంకావడంతో పెట్టుబడుల కోసం రైతులు సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ సర్కార్‌లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించిన రైతులకు వారం, పదిరోజుల్లోనే డబ్బులు జమయ్యేవి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రెండునెలలు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు సంబంధించిన రూ.655 కోట్లు తక్షణం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు బుధవారం ఖమ్మంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని కలిశారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల అప్పుల భారం, పిల్లల చదువుల ఫీజులు, మరోవైపు వానకాలం సీజన్‌కు అవసరమైన వ్యవసాయ పెట్టుబడులతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అదనపు కలెక్టర్‌కు వివరించారు. మొక్కజొన్న కొనుగోలు చేసిన డబ్బులు ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణం మొక్కజొన్న డబ్బులను అందించాలని వేడుకున్నారు. అదనపు కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం బాధ్యులు వాసిరెడ్డి ప్రసాద్, ఎస్కే మీరా, వై శ్రీనివాసరావు, మధు, వెంకటేశ్వరరావు, మంగయ్య ఉన్నారు.