ఖమ్మం వ్యవసాయం/పాల్వంచ, నవంబర్ 4 : రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సోమవారం ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఏఎంసీలోని పత్తి యార్డులో మహా ధర్నా నిర్వహించిన అనంతరం ఆ సంఘం రాష్ట్ర నాయకుడు గుర్రం అచ్చయ్య మాట్లాడుతూ అధిక వర్షాలు, తెగుళ్లతో ఎంతో కొంత చేతికొచ్చిన పత్తి పంటను నిబంధనల పేరుతో సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదని, దీంతో ప్రైవేటులో అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు.
జిన్నింగ్ మిల్లుల వద్ద కాకుండా మార్కెట్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా పత్తి క్వింటాకు రూ.17 వేల చొప్పున కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదన్నారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించిన అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెచ్చెల రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో బయట వ్యాపారులకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
కనీసం పెట్టుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే పంట ఉత్పత్తులకు సంబంధించిన రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలని వారు డిమండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం నాయకులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, పాశం అప్పారావు, ముద్దా భిక్షం, కల్లూరు కిశోర్, బుర్ర వెంకన్న, బానోత్ ధర్మ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.