తల్లాడ, మే 2: మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తల్లాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు తెరిచి మూడు వారాలు గడిచినా బస్తా ధాన్యం కొనలేదని, పంటను అమ్ముకునేందుకు రైతులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతు సమస్యలపై ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా మంత్రులు, అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. ఇప్పటికే 80 శాతం ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారని, ఉన్న 20 శాతం కొనడానికే కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు కల్యాణం కృష్ణయ్య, నల్లమోతు మోహన్‌రావు, అయినాల రామలింగేశ్వరరావు, సత్తెనపల్లి నరేశ్, కుర్నవల్లి, కలకొడిమ, నూతనకల్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.