‘అన్నపూర్ణ సంస్థ స్థాపించి 50 ఏండ్లు పూర్తయింది. ఆ సందర్భంలో ఏదో ఒక మంచి సినిమా చేయాలని టీమ్ అంతా ఆలోచించి చేసిన సినిమా ఇది. ‘ఉయ్యాల జంపాల’లో ఏపీ కల్చర్ చూపించాం. ‘లెనిన్’తో రాయలసీమ కల్చర్ చూపించాం. తెలంగాణ కల్చర్‌తో కూడా ఓ సినిమా ఎందుకు తీయకూడదు అనుకున్నప్పుడు ఈ కథ మాకు దొరికింది. తల్లిదండ్రుల్ని చూసుకోవడం అదృష్టం. ఉదయ్ రాసిన ఈ కథలో ఉన్నది అదే. వినోదాత్మకంగా కథ చెప్పాడు తను. 20రూపాయల ‘పళ్లబురుసు’ కోసం తండ్రిపై కొడుకు కేసు వేయడం కొత్తగా అనిపించింది. అందరూ అద్బుతంగా నటించారు. టీమ్ అంతా ప్రేమతో పనిచేశారు. ఈ సినిమా చూసి మనసు బరువెక్కింది. ఇలాంటి కొత్త కథలతో ఎవరైనా వస్తే, సినిమాలు నిర్మించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉంది’ అని అగ్ర హీరో అక్కినేని నాగార్జున అన్నారు.
తెలంగాణ నేపథ్య కథాంశంతో ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణన్లతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘పళ్ళబురుసు’. ‘బలగం’ఫేం సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడారు. మధ్య తరగతి జీవితాలను ఈ సినిమాలో చూపించానని దర్శకుడు ఉదయ్ చౌహాన్ చెప్పారు. ‘బలగం’ఫేం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నా లాంటి గ్రామీణ కళాకారుల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూసి పెరిగిన తాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో నటించడం గొప్ప అనుభవమని నటుడు మురళీధర్ గౌడ్ అన్నారు. ఇంకా సుప్రియ యార్లగడ్డ, నటుడు ప్రజ్వల్, నటి గోమతిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్, ఎడిటర్ సృజన అడుసుమిల్లి, డీవోపీ వినోద్ కె.బంగారి, గీత రచయిత సురేశ్ గంగుల కూడా మాట్లాడారు.