రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంట సీజన్ షురువైనా.. సాగు పనులు పక్కనపెట్టి రుణమాఫీ కోసం ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పడంపై మండిపడ్డారు. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా మాఫీ చేయాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్, తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టగా.. రైతులు కూడా స్వచ్ఛందంగా దీక్షకు పూనుకున్నారు. పలువురు రైతులు చేపట్టిన ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
– ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జూలూరుపాడు మండలం చింతల్‌తండా గ్రామంలో రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. గ్రామంలో 130 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని గొంతెత్తి అరిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామానికి చెందిన ధరంసోత్ పద్మకు పోడు పట్టా ఉంది. ఆనాడు పోడు చేసి సంపాదించిన హక్కు పత్రం కూడా ప్రభుత్వం ఇచ్చింది. గత కేసీఆర్ సర్కారు ఆ మహిళా రైతుకు రైతుబంధు, రుణమాఫీ కూడా ఇచ్చింది. కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రూ.35 వేల రుణమాఫీ కూడా చేయలేకపోయింది. దీంతో కాంగ్రెస్ చేతిలో తాము మోసపోయామంటూ ఆ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తనలాంటి రైతులు గ్రామంలో చాలామంది ఉన్నారని చెబుతున్నది.
మా ఊర్లో అందరికీ అన్యాయమే జరిగింది. అందరూ రూ.లక్ష లోపు అప్పు తీసుకున్న వాళ్లమే. గుట్టపక్కన పోడు చేసుకుని బతుకుతున్నాం. మాకు మూడు రంగుల పార్టీ చుక్కలు చూపిస్తున్నది. మాకు న్యాయం జరగకపోతే బ్యాంకు దగ్గర ధర్నా చేస్తాం. అధికారులు మా ఊరు వచ్చి లెక్కలు చూడండి.. మా బతుకులు చూడండి.
– భూక్యా శోభ. చింతల్‌తండా, మహిళా రైతు
వ్యవసాయాన్నే నమ్ముకొని రెక్కల కష్టం మీద బతుకుతున్నాను. సాగు చేస్తేనే కూడు ఉంటది. మా లాంటి పేద రైతులకు కూడా అన్యాయం ఎలా చేయబుద్ది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. గత కేసీఆర్ ప్రభుత్వంలో నాకు రైతుబంధు వచ్చింది. రుణమాఫీ కూడా అయ్యింది. ఇప్పుడున్న రూ.35 వేల బాకీ కూడా మాఫీ కాలే. బ్యాంకు వాళ్లు తప్పు చేశారా, అధికారులు తప్పు చేశారా చెప్పాలి.
– ధరంసోత్ పద్మ, చింతల్‌తండా,జూలూరుపాడు మండలం
నా పేరు ధరావత్ లక్ష్మా, కొత్తతండా(పి), టేకులపల్లి మండలం. నాకు 8ఎకరాల భూమి ఉంది. రెండు ఎకరాలు పత్తి, ఆరు ఎకరాలు మిర్చితోట, రెండు ఎకరాలు కౌలు భూమిలో వరి సాగు చేస్తున్న. గత పది సంవత్సరాలుగా బ్యాంక్‌లో వ్యవసాయ లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తున్న. గడిచిన మూడు సంవత్సరాలుగా మిర్చి తోటలో భారీ నష్టం వచ్చింది. ఒక బ్యాంక్‌లో రూ.లక్షా 30 వేలు, మరో బ్యాంక్‌లో రూ.లక్షా 50 వేల లోన్ ఉంది. గతంలో కేసీఆర్ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేసిన వెంటనే లోన్ ఇచ్చాడు. కాని ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నది. రైతులను ఇబ్బందిపెడితే ఏ ప్రభుత్వానికైనా భవిష్యత్ ఉండదు.
– ధరావత్ లక్ష్మా, కొత్తతండా(పి), టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నాకు నాలుగెకరాల భూమి ఉంది. దానిపై బ్యాంక్‌లో మూడు లక్షల అప్పు ఉంది. ప్రస్తుతానికి నాకు రెండు లక్షల అప్పు మాఫీ కావాలంటే ముందుగా ఒక లక్ష బ్యాంక్‌లో కట్టాలని బ్యాంక్ అధికారులు అంటున్నారు. వ్యవసాయ పెట్టుబడులకే డబ్బులు లేని స్థితిలో అప్పు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం అంటే రైతుల కష్టాలను తెలుసుకొని రైతులకు ఏ టైంలో ఏమి కావాలని ఆలోచించి అందించేలా ఉండాలి కానీ అప్పు కడితే రుణమాఫీ అంటే రైతుల ఉసురు తీసినట్టే.
– మాలోత్ బాలాజీ, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నాకు రేషన్ కార్డు లేని కారణంగా కుటుంబ ధ్రువీకరణ జరగలేదని రుణమాఫీ కాలేదు. ఇప్పటికే రుణమాఫీ కోసం వ్యవసాయాధికారికి దరఖాస్తు ఇచ్చాను. విచారణ పూర్తి చేసి రుణమాఫీ చేస్తారంట. అది ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నా. రుణమాఫీ పొందాలంటే రైతులు ఇన్ని తిప్పలు పడాలా. ఇదెక్కడి న్యాయం.
-అడపా సుబ్బారావు, మందలపల్లి, దమ్మపేట మండలం
రూ.2 లక్షల రుణమాఫీ పథకం మూడు విడుతలుగా చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి.. రూ.80 వేలు రుణమాఫీ ఎందుకు చేయలేదు. పట్టాదారు పాస్‌పుస్తకం, తెల్లరేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా ఉంది. అన్నీ సక్రమంగా ఉన్నా రుణమాఫీ కావడం లేదని ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి.
-కర్రి సత్యనారాయణ, రైతు, లంకపల్లి, పెనుబల్లి మండలం
ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ వర్తించలేదు. నాకు బ్యాంకులో రూ.2,02,000 అప్పు ఉంది. అయితే రూ.2 వేలు సాకు చూపించి రూ.2 లక్షల రుణమాఫీని ఆపారు. కనీసం సమాచారం ఇచ్చి రూ.2 వేలు కడితే రుణమాఫీ వర్తిస్తుందని ముందే చెబితే రూ.2 వేలు కట్టే వాడిని కదా.. ఇలాంటి సాకులు చూపి ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదు.
-దోసపాటి హరీశ్, రైతు, లంకపల్లి, పెనుబల్లి మండలం
భార్యాభర్తలం ఇద్దరం బ్యాంకులో రుణం తీసుకున్నాం. ఇద్దరి పేరున రూ.2.70 లక్షల రుణం ఉంది. కానీ.. ఇప్పుడు ఒకే కుటుంబం.. రేషన్ కార్డు ఆధారమంటూ కొర్రీలు పెడుతున్నారు. అదేదో ముందే చెబితే రూ.70 వేలు కట్టి రూ.2 లక్షలు రుణమాఫీలో ఉండేవాళ్లం. ఇప్పుడు జాబితాలో పేరు లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి. దరఖాస్తు అయితే ఇచ్చాం.
-ధరావత్ బాలాజీ, రైతు, అడవిమల్లెల, పెనుబల్లి మండలం
చండ్రుగొండ, ఆగస్టు 21 : అర్హులమైనా మా రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెం టనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు చండ్రుగొండ రైతు వేదిక ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు లేని షరతులు.. మాఫీ చేసేటప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రైతులను రుణ విముక్తులను చేస్తామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. రేషన్ కార్డు, పట్టా
దారు పాస్‌పుస్తకం వంటి షరతులు పెట్టకుండా.. అర్హులైన రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల దరఖాస్తులను ప్రజావాణిలో తీసుకోవడం లేదని, ఎక్కువ రుణం ఉంటే దరఖాస్తులు తీసుకోరా? అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 21 : ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయగూడెం గ్రామానికి చెందిన రైతులు నైనారపు వెంకటేశ్వరరావు, నార్లపాటి సిద్దయ్యలు దీక్ష చేపట్టారు. గ్రామంలోని రింగురోడ్డు సెంటర్లో బుధవారం రైతులు చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలికింది. రైతులకు మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ మాట్లాడుతూ రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు ఎలాంటి షరతులు, కొర్రీలు పెట్టకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, జుజ్జురపు శ్రీరామ్మూర్తి, చిప్పనపల్లి బజారయ్య, చైతన్య, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.