బోనకల్లు, డిసెంబర్ 25 : యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. వానకాలం పంటలు సాగు చేసిన రైతులకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. అయితే యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు యారియా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేసినా అది అందుబాటులోకి రాకపోవడంతో మళ్లీ పాత పద్ధతి ద్వారానే సొసైటీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో యాసంగి మొక్కజొన్న సాగు చేసిన రైతులు సొసైటీల వద్దకు వెళ్లినా నిల్వలు లేకపోవడంతో పొరుగునే ఉన్న ఏపీ రాష్ర్టానికి వెళ్లి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. బోనకల్లు ప్రాంతంలో 17 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. పంట అదునుకు యూరియా అవసరం కావడం.. ఇక్కడ నిల్వలు లేకపోవడంతో ఏపీ రాష్ర్టానికి యూరియా కోసం వెళ్తున్నారు. అయితే ఇక్కడి రైతుల అవసరాన్ని గమనించిన అక్కడి వ్యాపారులు ధర పెంచి మరీ విక్రయిస్తున్నారు. అదనంగా రూ.500 వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో రైతులపై ఆర్థిక పడుతున్నది. సకాలంలో యూరియా వేయకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళనతో రైతులు అప్పోసప్పో చేసి కొనుగోలు చేస్తున్నారు. యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలోని సొసైటీ కార్యాలయాల్లో సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో చేసేది లేక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫెర్టిలైజర్ షాపులను రైతులు ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు మండలం నుంచి రైతులు అధికంగా యూరియా కోసం వస్తుండడంతో ఇదే అదునుగా భావించిన అక్కడి వ్యాపారులు ప్రభుత్వ ధర కంటే ఒక్కో బస్తాకు రూ.500 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయానికి ఎరువులు సరఫరా చేసి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండేవి కావని పలువురు రైతులు మండిపడుతున్నారు.
వానకాలంలో కూడా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డామని, యాసంగిలోనూ మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం దారుణమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల అవసరాలను గుర్తించి సహకార సంఘాలకు, ఎరువుల డీలర్లకు పూర్తిస్థాయిలో యూరియా నిల్వలు సరఫరా చేయాలని కోరుతున్నారు. యాప్ సమస్యను పరిష్కరించాలని, లేదా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఎరువులు అందించాలని కోరుతున్నారు. సకాలంలో ఎరువులు అందకపోతే పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గి తాము తీవ్రంగా నష్టపోతామని బోనకల్లు ప్రాంత రైతాంగం ఆవేదన చెందుతున్నారు.
యాసంగిలో ఆరు ఎకరాలు రూ.1.20 లక్షలకు కౌలుకు తీసుకొని మొక్కజొన్న వేశాను. పంటకు యూరియా అవసరమొచ్చింది. కానీ, సహకార సంఘంలో యూరియా లేదు. పక్క రాష్ట్రంలో ఒక్క యూరియా కట్టను బ్లాక్ మార్కెట్లో రూ.500 చొప్పున కొనుగోలు చేశాను. ఇక్కడి అధికారులు యాప్లో బుక్ చేసుకోవాలని చెప్పారు. మళ్లీ అవసరం లేదని చెప్పారు. యూరియా సమస్యను పరిష్కరించేది ఎవరు. తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది.
రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాను. పంటకు యూరియా అవసరం కావడంతో సొసైటీ కార్యాలయం వద్దకు వెళ్తే.. నాలుగు కట్టలు అవసరం ఉంటే ఒక కట్ట మాత్రమే ఇచ్చారు. చేసేది లేక పక్క రాష్ట్రం వెళ్లి ఒక యూరియా కట్టను రూ.500కు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేశాను. ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియాను సకాలంలో సరఫరా చేసి పంటల సాగుకు సహకరించాలి. వారికి కావాల్సిన యూనియాను ప్రభుత్వం సరఫరా చేసి ఆదుకోవాలి.