ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులు.. వడగళ్లతో కూడిన వర్షాలు అన్నదాతలను కోలుకోకుండా చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో వారంరోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలు నీటిపాలవుతున్నాయి. సాగునీరు అందకపోయినా బావులు, మోటర్లు, బోర్ల సాయంతో ఎలాగోలా పండించిన పంటను వరుణుడు పగబట్టినట్లు ఆగమాగం చేస్తుండడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం రాత్రి పలు మండలాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి పంటలు తలలు వాల్చాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మధిర/ దుమ్ముగూడెం/ పెనుబల్లి/అన్నపురెడ్డిపల్లి/దమ్మపేట, ఏప్రిల్ 14
మధిర, బోనకల్లు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. మధిర మండలంలో అక్కడక్కడా మొక్కజొన్న పైరు నేలవాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటపై టార్పాలిన్లు కప్పినప్పటికీ గాలికి లేచిపోయి తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు రైతులను ఆదుకోవాలని కోరారు. దుమ్ముగూడెం మండలం రామారావుపేటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఈదురుగాలులకు వరికంకులు రాలిపోయి తీవ్రనష్టం జరిగిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజర, కిష్టారం, లోకారం, హనుమత్తండా, కల్లూరుకు చెందిన రైతులు రెండురోజుల క్రితం పుల్లయ్యబంజర ఐకేపీ కేంద్రం(శివాలయం ప్రాంతం)లో ధాన్యాన్ని ఆరబోశారు. మరోపక్క కోసిన ధాన్యాన్ని పొలాల్లోనే ఆరబోశారు. అయితే ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పొలాల్లో ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయ్యింది.
ఈ ధాన్యాన్ని ట్రాక్టర్లతో మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. అలాగే ఐకేపీ కేంద్రం ప్రాంతంలో ఆరబెట్టిన ధాన్యం వరద నీటికి సమీప పొలాలు, కాల్వల్లోకి కొంతమేర కొట్టుకుపోయింది. చుంచుపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న చేలన్నీ నేలవాలాయి. కొందరు రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం అయ్యింది.
భద్రాద్రి జిల్లాలో 33 శాతం వరి పంటకు నష్టం
భద్రాద్రి జిల్లాలో రైతులు పండించిన వరి పంటకు 33 శాతం వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంట నేలకొరిగినా పూర్తిస్థాయిలో నష్టం ఉండదని అధికారులు చెబుతున్నా.. పడిపోయిన వరి పనలు చేతికి రావని, నీటిలోనే ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరితోపాటు మొక్కజొన్న పంటలు కూడా నేలవాలినట్లు అధికారులు చెబుతున్నారు.
కౌలు రైతులను ఆదుకోవాలి..
నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాను. ధాన్యాన్ని ఆరబోసేందుకు సరైన ప్రదేశం లేకపోవడంతో పొలాల్లోనే ఆరబెట్టాను. అకాల వర్షంతో పొలంలోనే నీరు ఉండడంతో ధాన్యంలోకి నీరు చేరింది. వర్షంతో పూర్తి నష్టం వాటిల్లింది. అధికారులు అంచనా వేసి కౌలు రైతులను ఆదుకోవాలి.
– తడికమల్ల వెంకటి, కౌలు రైతు, పుల్లయ్యబంజర
రైతుకు ఎప్పుడూ తిప్పలే..
ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట పండించాను. పంటను అమ్ముకునేందుకు కేంద్రాల్లో ఆరబోసి అమ్మాలి. దీనికి తోడు మళ్లీ వర్షం రావడంతో వడ్లన్నీ తడిశాయి. మళ్లీ కూలీలచే వేరే ప్రాంతానికి తరలించాలి. ఎటు తిరిగి రైతుకు తిప్పలే. కౌలు తప్పదు.. ఖర్చు తప్పదు. కౌలు రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి.
– దొంగల కృష్ణయ్య, కౌలు రైతు, పుల్లయ్యబంజర
కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలు..
కోతకు సిద్ధంగా ఉన్న వరి గాలిదుమారంతో మొత్తం నేలపాలైంది. ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లింది. రాలిపోయిన వడ్లు రంగు మారే అవకాశం ఉంది. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే మాకు నష్టం రాకుండా ఉంటుంది. ఎన్ని చెప్పినా కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగానే వెనక్కి పంపుతారు.
– కట్టా రామకృష్ణ, రైతు, పెనగడప, చుంచుపల్లి
నేలవాలిన మూడెకరాల వరి
మూడెకరాల్లో వేసిన వరి పంట మొత్తం నేలవాలింది. ఎండ వస్తే తప్ప వరి పనలు పైకి రావు. కంకులన్నీ కిందనే పడిపోయాయి. వడ్లన్నీ భూమిమీదే ఉన్నాయి. ఎకరానికి మూడు క్వింటాళ్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. తిండి గింజలు లేకపోతే ఏడాదంతా గడవడం చాలా కష్టంగా ఉంటుంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
– పావురాల రాజేశ్, రైతు, పెనగడప, చుంచుపల్లి
తెల్లారే సరికి నీటిపాలు..
రెండురోజుల క్రితం ధాన్యం కోసి ఆరబెట్టాం. కొనుగోలు కేంద్రాల్లో వేద్దామని.. తేమ శాతం రాలేదని రోజువారీగా తిరగేసి ఆరబోస్తున్నాం. రాత్రివేళ వర్షం ఒక్కసారిగా కురవడంతో పొద్దున్నే వచ్చే సరికి ధాన్యం నీటిపాలైంది. మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. అసలే ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. అకాల వర్షం కోలుకోకుండా చేసింది.
– బజ్జూరి గోపాలకృష్ణ, కౌలు రైతు, కల్లూరు