భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ‘పేరు గొప్ప – ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ తీరు. ఆగస్టు 15 నాటికి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. కనీసం రూ.20 వేలు, రూ.30 వేలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మిగతా రైతులకు వచ్చి తమకు ఎందుకు రాలేదని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం సొసైటీ పరిధిలో నాలుగు మండలాల రైతులు సహకార సంఘంలో రుణాలు తీసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెంకు చెందిన మొత్తం 3,140 మంది రైతులు రుణాలు తీసుకుంటే మొదటి విడతగా 639 మందికి, రెండోవిడత 269 మందికే రుణమాఫీ అయ్యింది. దీంతో ఆయా మండలాల రైతులు సొసైటీకి వచ్చి మా సంగతేందంటూ అధికారుల్ని నిలదీస్తున్నారు.
మొదటివిడతలో వారంరోజులు తిరిగినం.. రెండోవిడతలో ఎన్ని రోజులు తిరగాలో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కొర్రీలు పెట్టి రుణమాఫీ జాబితాలో పేర్లు లేకుండా చేయడంతో రైతన్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఒక్క సహకార బ్యాంకుల ద్వారానే 49,099 మంది రైతులు రూ.లక్షలోపు, రూ.లక్ష యాభై వేల లోపు రుణాలు తీసుకుంటే నాలుగువేల మందికి కూడా రుణాలు మాఫీకాకపోవడం విశేషం. ఇది కేవలం సొసైటీ పరిధి మాత్రమే. ఇక బ్యాంకుల లెక్కలపై అధికారులు పెదవి విప్పడం లేదు. వ్యవసాయాధికారిని అడిగితే బ్యాంకుకు వెళ్లండి అని బ్యాంకుకు వెళ్తే ఏవో సార్‌ను అడగాలని తిప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ విషయంలో సర్కారు పెడుతున్న కొర్రీలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూటకోమాట రోజుకో నిబంధన పెట్టి మా ఉసురుపోసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం రైతువేదికల వద్ద సమావేశాలు పెట్టి రుణమాఫీ అయిన వారిని పిలిచి వారి పేర్లు చదువుతున్నారు.. కాని రానివారిని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం మూడోవిడతలోనైనా తమ పేర్లు వస్తాయో రావో అని చూసిన తర్వాత ఆందోళన చేస్తామని రైతు సంఘం నాయకులు చెప్తున్నారు.
నా పేరు రుణమాఫీలో లేదు. సొసైటీలో రూ.20 వేలు, స్టేట్‌బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్న రెండోవిడతలో నా పేరు వస్తుందని అనుకున్నా తీరా చూస్తే రాలేదు. ఇదెక్కడి న్యాయం. పొలం వేసుకుంటున్నాము. మాకు రుణమాఫీ రాకపోతే అప్పు ఎలా తీర్చాలి. పెద్దసార్లు ఆలోచించి న్యాయం చేయాలి.
– అజ్మీరా హిరాణి, పూప్లాతండా, సుజాతనగర్ మండలం
రుణమాఫీ అయితుందని ఆటోలో వచ్చిన. నాకు ఆరోగ్యం బాగాలేదు. నడవలేకపోతే నన్ను ఆటోలో తీసుకొచ్చారు. మా వాళ్లు వెళ్లి అడిగితే రుణమాఫీ కాలేదన్నారు. అప్పు నేను తీర్చలేను. పంటలో లాభం రాలేదు. చాలా కష్టాలు పడుతున్నాను. నన్ను ఆదుకోవాలి.
– బానోత్ భద్రు, రూప్లాతండా, సుజాతనగర్ మండలం