దుమ్ముగూడెం, జనవరి 11 : రైతుకు క్వింటా ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయని అన్నదాతలు మండిపడుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో 45,500 క్వింటాళ్ల ధాన్యానికి.. 10,500 క్వింటాళ్లకే బోనస్ అందిందని, మిగతా రైతులకు అందలేదని వాపోతున్నారు. మండలవ్యాప్తంగా 130 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఒక్కో లారీకి 350 క్వింటాళ్ల చొప్పున ధాన్యం వస్తుండటంతో సుమారు 130 లారీల ధాన్యం అంటే.. 45,500 క్వింటాళ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు.
అయితే అందులో 10,500 క్వింటాళ్లకు మాత్రమే బోనస్ అందిందని, మిగిలిన రైతులకు అందలేదని అన్నదాతలు వాపోతున్నారు. మండలంలోని సహకార సంఘాల ద్వారా నర్సాపురం, సీతారాంపురం, ములకపాడు, దుమ్ముగూడెం, బైరాగులపాడు, కె.లక్ష్మీపురం, గోవిందాపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండగా.. వీటి ద్వారా 95 లారీల ధాన్యం ఎగుమతి చేశారు. అలాగే జీసీసీ ఆధ్వర్యంలో చిన్నబండిరేవులో 6, చిన్ననల్లబల్లి 18, మహాదేవపురం ఏడు, మారాయిగూడెంలో మూడు.. మొత్తం 34 లారీల ధాన్యాన్ని ఎగుమతి చేశారు. ఇదిలా ఉండగా.. సహకార సంఘం ద్వారా 105 లారీల ధాన్యం ఎగుమతి చేయగా.. రెండు లారీల ధాన్యానికే బోనస్ పడింది.
మిగతా 103 లారీల ధాన్యానికి ఇంకా రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమకాలేదు. ఏదేమైనా వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే బోనస్ మినహాయించి నగదు జమ అవుతున్నదని రైతులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ నాటికైనా బోనస్ డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతాయా? లేదా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై సొసైటీ సీఈవో హిమబిందును వివరణ కోరగా.. రెండు లారీల ధాన్యానికే బోనస్ పడిందని, మిగిలిన వారికి త్వరలోనే పడుతుందని తెలిపారు. అలాగే జీసీసీ మేనేజర్ జయరావును వివరణ కోరగా.. ధాన్యం విక్రయించిన రైతులకు దఫా దఫాలుగా బోనస్ డబ్బులు జమ అవుతాయని చెప్పడం కొసమెరుపు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వరి ధాన్యానికి బోనస్‌గా రూ.500 ఇస్తామని ప్రకటించింది. 20 రోజులు ధాన్యం ఆరబెట్టి విక్రయించినా ఇప్పటివరకు బోనస్ నా ఖాతాలో జమ కాలేదు. ఈ ధాన్యాన్ని పది రోజులు ఆరబెట్టి బయటి దళారులకు విక్రయిస్తే వెంటనే నగదు ఇచ్చేవారు. 20 రోజులు పంటను ఆరబెట్టి విక్రయించి రెండు నెలలైనా నేటికీ బోనస్ జమ కాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.