‘రైతుబంధు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. కానీ.. మేం అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం.’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీరా గెలిచాక ఒట్టును తీసి గట్టుమీద పెట్టింది. సీజన్లు సాగదీస్తూ, కాలాలు వెళ్లదీస్తూ హలధారులను అరిగోస పెట్టించింది. నమ్మబలికి నయవంచనకు గురిచేసింది. దీంతో సీజన్లు దాటిపోతున్నా సాయం అందకపోవడంతో అన్నదాతలను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
మళ్లీ అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు ‘ఇస్తాం’ అనే మాటలు చెబుతూ ‘కాలాలు’ వెళ్లదీస్తోంది తప్ప.. సీజన్‌కు ముందుగా సాయం అందించిన పాపాన పోలేదు. భద్రాద్రి జిల్లాలో ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఇప్పటికీ ‘రైతు భరోసా’ను జమ చేయలేదు. జనవరిలో మొదలుపెట్టిన యాసంగి సీజన్ పంటల పెట్టుబడి సాయం జమను ఐదు నెలలపాటు సాగదీసింది. అదికూడా ఐదెకరాల్లోపు రైతులకే అందించింది. ఆపైన విస్తీర్ణం ఉన్న రైతులకు నేటికీ పెండింగ్ పెట్టింది.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (నమస్తే తెలంగాణ
‘మేమొస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం.’ అనే హామీని కూడా తుంగలో తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. సుమారు ఏడాదికిపైగా కాలం గడిపి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎకరానికి రూ.12 వేల చొప్పునే చెల్లించాలని నిర్ణయించాం’ అంటూ ప్రకటించింది. అంటే వానకాలం సీజన్‌కు రూ.6 వేలు, యాసంగి సీజన్‌కు మరో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ.. ఈ ఏడాది వానకాలం సీజన్ పనులు మొదలవుతున్నప్పటికీ ఐదెకరాలు పైబడిన రైతులకు గత యాసంగి సీజన్లో జమ చేయాల్సిన రైతుభరోసాను ఇప్పటికీ జమ చేయలేదు. దీంతో గత యాసంగి సీజన్లో అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేసుకున్న రైతులు.. వాటిని తీర్చుకోలేకపోగా.. ఇప్పుడు వానకాలం సీజన్ కోసం మళ్లీ అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి ఎదురవుతోంది.
వానకాలం అంచనాలు సిద్ధం..
రైతుభరోసా అందక అన్నదాతలు ఆర్థికంగా సతమతమవుతున్నప్పటికీ.. వానకాలం సీజన్ మాత్రం రానే వచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ సీజన్‌కు ముందస్తు పంటల అంచనాలను సిద్ధం చేశారు. జిల్లాలో 4.71 లక్షల ఎకరాల్లో పంటలను వేయనున్నట్లు అంచనా వేశారు. ఇందులో వరి 1,65,485 ఎకరాలు, పత్తి 2,04,583 ఎకరాలు, మిర్చి 10,333 ఎకరాలు, జొన్న 85,527 ఎకరాలతోపాటు ఇతర పంటలను మరికొన్ని ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నట్లు అంచనాలు సిద్ధం చేశారు. ఈసారి భారీ వర్షాలు కురుస్తుండడం, కాలం ముందుగానే అయ్యే పరిస్థితి కన్పిస్తుండడంతో తమకు ఈ సీజన్ కలిసొస్తుందనే ఆశతో అన్నదాతలు ఉన్నారు. కానీ.. కాంగ్రెస్ సర్కారు మాత్రం వారికి సకాలంలో పంటల పెట్టుబడి సాయాన్ని అందించకపోవడం వారికి గుదిబండగా మారుతోంది.
యాసంగి ధాన్యం కొనుగోళ్లలోనూ జాప్యం..
భద్రాద్రి జిల్లాలో యాసంగి పంట వేసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. తేమ పేరుతో ధాన్యం రాసులను కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచడంతో అకాల వర్షాలకు అవి తడిసిపోయాయి. ఫలితంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతుల వద్ద ధాన్యం ఉండడం గమనార్హం. జిల్లాలో 144 కొనుగోలు కేందాల్లో 39,072 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేవలం 5,685 మంది రైతులు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. వారికి ఇప్పటివరకు రూ.90 కోట్లను చెల్లించింది. ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనల కారణంగా చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకున్నారు.
ఇంకా జమ కావాల్సిన మొత్తం రూ.132 కోట్లు..
భద్రాద్రి జిల్లాలో 1,75,770 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వీరికి రూ.294 కోట్లు జమ చేయాల్సి ఉంది. వీరిలో ఐదు ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న 1,37,718 మందికి మాత్రమే రూ.162 కోట్లను ఇప్పటి వరకూ జమ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఐదెకరాలకు పైబడిన విస్తీర్ణం ఉన్న 38,052 మంది రైతులకు ఇంకా రూ.132 కోట్లు జమ కావాల్సి ఉంది.
కటాఫ్ తేదీ ఏమీ లేదు..
ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటి నుంచి ప్రతీ రోజూ కొంతమందికి రైతుభరోసా జమ అవుతోంది. జిల్లాలో ఎంతమందికి సాయం జమ అయిందో అనే సమాచారం మాకు ఎప్పటికప్పుడు వస్తుంది. రైతుభరోసా జమ కోసం కటాఫ్ తేదీ అంటూ ఏమీ లేదు. ఇక వానకాలం పంటలకూ అంచనాలు సిద్ధం చేశాం.
-వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి
రైతు భరోసా జమ కాలేదు..
నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో పంట వేయక ముందే, సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు జమ అయ్యేది. కాంగ్రెస్ వచ్చాక గత వానకాలం సీజన్లో రాలేదు. యాసంగిలో ఐదెకరాల్లోపు వాళ్లకే ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అందరికీ వస్తాయనే చెబుతున్నారు. ఇంతలో యాసంగి పోయింది. వానకాలం వచ్చింది.
-ఆళ్ల శ్రీను, రైతు, తుంగారం, చండ్రుగొండ
సాయంపై నమ్మకం లేదు..
రైతుభరోసా పంటల సాయం అందుతుందన్న నమ్మకం లేదు. నాకైతే ఆ విశ్వాసం ఎప్పుడో పోయింది. ఇప్పటిదాకా వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయాను. ఎప్పుడెళ్లి అడిగినా అందరికీ వస్తాయన్న సమాధానమే చెబుతున్నారు. కానీ రాలేదు. బ్యాంకులో అడిగితే మీకే మెసేజ్ వస్తుందని చెబుతున్నారు. మెసేజ్ రాలేదు. సాయం జమ కాలేదు.
-అట్ల శ్రీను, రైతు, రేపల్లెవాడ, చుండ్రుగొండ