గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు ముంచెత్తడంతో బాధితులు విలవిల్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బలై 50 రోజులు గడిచిపోయాయి. అయితే వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బాధితులకు ఇప్పటివరకూ పరిహారం అందించకుండా తాత్సారం చేస్తున్నది. దీంతో వారు మరింత కుంగిపోతున్నారు.
వరదల కారణంగా భారీగా నష్టపోయిన రైతన్నలు పంట నష్టపరిహారం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు సర్కారు నిర్లక్ష్యం కారణంగా మరింత కుదేలవుతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వరద ఇళ్లలోకి రావడంతో కట్టుబట్టలతో బయటికొచ్చిన బాధితుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. వారికి సర్కారు అందిస్తానన్న సాయం రూ.16,500 సైతం అందకపోవడంతో అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గత ఆగస్టు 31న కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తడంతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. కొద్దిరోజులకే సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర బృంద సభ్యులు వరుస పర్యటనలు చేసి ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే నష్టం జరిగి రెండు నెలలు కావొస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 27 వేల మంది రైతు కుటుంబాలకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్ర సర్కారు కాలయాపన చేస్తున్నది. ఇసుక మేటలు వేయడంతో ఇప్పట్లో తిరిగి సాగు చేసుకునే అవకాశం సైతం లేకుండాపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంతోపాటు ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో వేలాది కుటుంబాలు వరదలకు బాధితులుగా మిగిలారు. కేటగిరీల వారీగా విభజించి తూతూమంత్రంగా కొద్దిమందికి మాత్రమే రూ.16,500 చొప్పున అకౌంట్లో వేయడంతో వేయికళ్లతో ఎదురుచూడడం మిగిలినవారి వంతయింది.
జిల్లాలోని ఆకేరు, మున్నేరు వాగులు పొంగి ప్రవహించడంతో వరదలకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాగుల సమీపంలోని పంట పొలాల్లో పెద్దఎత్తున ఇసుక మేటలు వేసింది. జిల్లావ్యాప్తంగా 27,242 మంది రైతులకు సంబంధించి 28,407 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇందుకు గాను ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.28.40 కోట్ల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బాధిత రైతులకు అణా పైసా పంటనష్ట పరిహారం అందలేదు.
మున్నేరు వరద బాధితుల తీరు మరోలా ఉంది. అనేకసార్లు సర్వే చేసిన అధికారులు వడపోత కార్యక్రమం చేపట్టి సగానికి సగమే అర్హులుగా తేల్చారు. సదరు లబ్ధిదారుల అకౌంట్లలో కొద్దిమందికే రూ.16,500 జమ చేశారు. అయితే పూర్తిగా ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాల వివరాలు సర్వేలో లేకపోవడం, టెక్నికల్ కారణంగా మరికొంతమందికి కోత పెట్టారు. వారంరోజులపాటు సర్వే చేసిన యంత్రాంగం చివరకు తుది జాబితాను ప్రభుత్వానికి అందజేసింది.
అయితే ఈ సర్వేలో అనేక కొర్రీలు, పొరపచ్చాలు ఏర్పడడంతో అర్హులకు న్యాయం జరగలేదు. అసలైన బాధితుల్లో చాలామందిని కేటగిరీ-1, కేటగిరీ-2లో చేర్చారని వారు వాపోతున్నారు. కేవలం కేటగిరీ-3పైన ఉంటేనే నష్టపరిహారానికి అర్హులవుతారని కొందరు అధికారులు చెప్పినట్లు వరద బాధితులు చెబుతున్నారు. దీంతో జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ అనేకమంది ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు. అయితే రెండోవిడతలో దరఖాస్తులు అందజేసే బాధితులకు సర్కారు సాయం అందుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
నా ఆరు ఎకరాల పంట వరదలకు తుడిచిపెట్టుకుపోయింది. రాత్రికి రాత్రే వరదల్లో కొట్టుకపోయింది. వరి పొలం చేతికి వచ్చే సమయంలో వరదలొచ్చాయి. మిర్చి తోటలు అప్పుడే వేశాం. ఆరు ఎకరాల సాగుకు దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేశారు.. కానీ నయా పైసా పరిహారం అందలేదు.
– తేజావత్ సంతు, రైతు, తీర్థాల, ఖమ్మంరూరల్
పొలాలను చూస్తే దుఖం వస్తున్నది. నా మూడెకరాల మిర్చితోట పూర్తిగా కొట్టుకపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. తోట వేసిన కొద్దిరోజులకే వరదలు రావడంతో ఒక్క చెట్టూ మిగలలేదు. ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోవడం లేదు. ఇస్తాననన్నా కనీసం రూ.10 వేలు ఇప్పటివరకు అతీగతీ లేదు. అదిగో వస్తాయి.. ఇదిగో వస్తాయి అంటున్నారు గానీ ఇవ్వడం లేదు. ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించాలి.
– వడ్లానపు బ్రహ్మయ్య, రైతు, తీర్థాల, ఖమ్మంరూరల్
పెదవాగు ప్రాజెక్టుకు గండిపడి నా మూడెకరాల పొలం ఇసుక మేటలు వేసింది. పంట పండించడానికి వీలులేకుండా పోయింది. మంత్రులు, అధికారులు వచ్చారు.. చూశారు.. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. ఎకరానికి రూ.పది వేలు ఇస్తామన్నారు. పది పైసలు కూడా ఇవ్వలేదు. ఇసుక తొలగించడం చిన్నరైతులకు సాధ్యం కాదు. బీడు భూములుగా మారాయి.
– డేరంగుల కురేశ్, రైతు, గుమ్మడవల్లి, అశ్వారావుపేట
మోరంపల్లి బంజర గ్రామంలో మూడెకరాల వరి సాగుచేశాం. వరదలకు మొత్తం ఇసుక మేటలు వేసింది. పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. నెల రోజులు గడుస్తున్నా నేటికీ సాయం అందలేదు. అధికారులను అడిగితే నివేదిక ప్రభుత్వానికి పంపామని చెబుతున్నారు. అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడి పెడితే నీటిపాలైంది. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
– లకావత్ శ్రీదేవి, రైతు, అంజనాపురం, బూర్గంపహాడ్