అశ్వారావుపేట, జూన్ 16 : కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ శాఖాధికారులు చేపట్టిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటీపీ సమస్యతో అటు అధికారులు, ఇటు రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎయిర్టెల్ సిమ్‌కార్డు ఉన్న రైతులకు మాత్రమే రెండో ఓటీపీ రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక ఏఈవోలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫార్మర్ ఐడీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం అమలుచేసే వ్యవసాయ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.
ఈ విషయంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ రైతుల నుంచి ఆశించిన మేర స్పందన లభించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 21.44 శాతం మాత్రమే ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. ఇందులో ఖమ్మం జిల్లా 39.93 శాతంతో మొదటిస్థానంలో ఉండగా.. మేడ్చల్ జిల్లా 2.55 శాతంతో చివరి స్థానంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 29.92 శాతంతో 7వ స్థానంలో నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు జారీ చేసిన ఆధార్ కార్డు తరహాలోనే రైతులకు కూడా 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు గాను రైతులు, భూముల వివరాలతో కూడిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ బాధ్యతలను వ్యవసాయ శాఖకు అప్పగించింది. వ్యవసాయాధికారులు ఈ ప్రక్రియను మే 5వ తేదీన ప్రారంభించారు.. కానీ.. ఆశించిన స్థాయిలో రైతుల నుంచి స్పందన కనిపించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంతోపాటు ఇతర కేంద్ర వ్యవసాయ పథకాలకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. వ్యవసాయరంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే ప్రధాన సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఒక్కో రైతుకు రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది.
రైతు పథకాల్లో ఎటువంటి అక్రమాలకు చోటులేకుండా నేరుగా రైతులకే అందేలా ఫార్మర్ ఐడీ అందించాలని నిర్ణయించింది. రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు కావడానికి అతడికి సంబంధించిన మొబైల్‌కు ఓటీపీలు వస్తాయి. యాప్‌లోకి ప్రవేశించేందుకు ఒక ఓటీపీ వస్తుంది. రైతు పాస్‌బుక్ నిర్ధారణకు రెండో ఓటీపీ రావాల్సి ఉంటుంది. ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రం రెండో ఓటీపీ సమస్య తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫార్మర్ ఐడీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులు, అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రైతు నమోదు ప్రక్రియను అధికారులు మే 5వ తేదీన ప్రారంభించారు. సుమారు 40 రోజులకు పైగా అవుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అధికారులు లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నారు. ఇందుకు సాంకేతిక సమస్య ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో ఓటీపీ సమస్య ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో అసలు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీనివల్ల ప్రక్రియ చాలా ఆలస్యమవుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి అధికారిక లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 39.93 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29.92 శాతం ప్రక్రియ పూర్తయ్యింది. వారం రోజులకు ఒకసారి నమోదు ప్రక్రియ అప్డేట్ అవుతోంది.
సాంకేతిక సమస్య వల్ల రైతు నమోదు ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. దీనికితోడు రైతుల నుంచి ఆశించిన స్పందన లేదు. ఎయిర్టెల్ సిమ్ వినియోగించే రైతులకు రెండో ఓటీపీ రావడం లేదు. ఏఈవోలు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రవికుమార్, ఏడీఏ, అశ్వారావుపేట