ఇల్లెందు, సెప్టెంబర్ 16: సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల వద్ద రైతులు నెలలకొద్దీ తిప్పలు పడుతూనే ఉన్నారు. సొసైటీ సిబ్బంది రైతులకు ముందుగా టోకెన్లు అందించినా.. పూర్తిస్థాయిలో సొసైటీలకు యూరియా చేరకపోవడంతో అరకొరగానే పంపిణీ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లెందు సొసైటీ గోడౌన్ వద్ద ఐదు రోజుల క్రితం టోకెన్లు తీసుకున్న రైతులు మంగళవారం తెల్లవారుజామునే యూరియా కోసం చేరుకున్నారు. అయితే సోమవారం ఒక్క లోడ్ రావడంతో కొందరికి మాత్రమే పంపిణీ చేశారని, మిగిలిన వారిని సొసైటీ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతమాత్రాన టోకెన్లు ఎందుకు ఇవ్వాలని పలువురు రైతులు ప్రశ్నించారు.
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 16: పాల్వంచ మండలం జగన్నాథపురం రైతు వేదికలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. శుక్ర, సోమవారం రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం స్వీకరించిన దరఖాస్తుదారులకు సోమవారం ఎరువులు వస్తాయని చెప్పిన అధికారులు.. సాయంత్రం లోడ్ రావడంతో పంపిణీ చేశారు. మంగళవారం సోములగూడెం, సూరారం, తోగ్గూడెం, నాగారం, సంగం, దంతెలబోర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో యూరియా కోసం రైతులు పోటీపడడంతో పోలీసు పహారా నడుమ పంపిణీ చేశారు.
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 16: పాల్వంచ సొసైటీ వద్దకు ఎరువుల కోసం వచ్చిన రైతులకు మధ్యాహ్న భోజనం అందించడం అదృష్టంగా భావిస్తున్నానని సొసైటీ వైస్ చైర్మన్ కాంపెలి కనకేష్ అన్నారు. రైతులకు ఆయన రెండో రోజు మంగళవారం భోజనాలు అందించారు. యూరియా పంపిణీ చేసినన్ని రోజులు మధ్యాహ్న భోజనం అందిస్తానని, ఇతరులు కూడా ఏదో విధంగా సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపూరి రాజూగౌడ్, రంజిత్, కిరణ్, శోభన్, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, అరుణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.