ఖమ్మం వ్యవసాయం/ సత్తుపల్లి, నవంబర్ 3: సుమారు 15 రోజుల క్రితం వరకు వానలు అడపా దడపా కురిశాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. నవంబర్ ఆరంభంలోనే చలి పంజా విసురుతున్నది. గత నెల చివరిలో జిల్లాలో 28 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా గురువారానికి 21 డిగ్రీలకు చేరుకున్నది. సాయంత్రం 5 గంటల నుంచి చల్లగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తున్నది. 8 గంటల వరకు మంచు తేరుకోవడం లేదు. ఏజెన్సీలో రహదారులను పూర్తిగా మంచు కప్పేస్తున్నది. వాహనదారులు దీపాలు వేసి వాహనాలు నడుపుతున్నారు. గడిచిన ఐదు రోజుల నుంచి మధ్యాహ్నం కొంతమేర పొడి వాతావరణం ఉన్నప్పటికీ రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
ఉన్నిదుస్తులకు గిరాకీ..
మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణశాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదయాన్నే బయటకు వచ్చే పేపర్ బాయ్స్, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు, సఫాయి కార్మికులు, పాలు పోసే వ్యక్తులు, హోటల్స్‌లో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గరం కోట్లు, మంకీ క్యాప్స్ ధరించే బయటకు రావాలంటున్నారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా తదితర పట్టణాల్లో ఇప్పటికే ఉన్ని దుస్తుల (స్వెట్టరు, రగ్గులు, మఫ్లర్స్, మంకీ క్యాప్స్) దుకాణాలు వెలిశాయి. ఉత్తరాది నుంచి వచ్చిన వ్యాపారులు ప్రధాన రహదారులు, కూడళ్లలో దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉన్ని దుస్తుల మ్మకాలుక్రమంగా ఊపందుకుంటున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అస్తమా బాధితులు చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి వెచ్చదాన్నిచ్చే దుస్తులను ధరించాలి. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తగ్గించాలి. రోజుకు 4-6 లీటర్ల నీరు తాగాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. జామ, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి పండ్లు తినాలి. ముఖ్యంగా విటమిన్-సి ఉన్న ఫలాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లను తీసుకోవాలి. చలికాలంలో సహజంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే జలుబు, దగ్గు తొందరగా వస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. బయటి పాస్ట్ఫుడ్ను దూరం పెట్టాలి. చర్మం దెబ్బతినకుండా లేపనాలు రాసుకోవాలి. సాధారణ సబ్బుల స్థానంలో గ్లిజరిన్ ఆధారిత సబ్బులను వాడాలి. శనగపిండితో స్నానం చేస్తే మరీ మంచిది.
వ్యాధులతో జాగ్రత్త..
వేసవి, వానకాలాల కంటే చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అస్తమా, శ్వాస కోశ, న్యూమోనియా వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలి కాలంలోనే జలుబు, దగ్గు వంటివి త్వరగా వ్యాపిస్తాయి. గోరువెచ్చని నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలనే తినాలి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు రాకూడదు.
-కిరణ్, ప్రభుత్వ వైద్యాధికారి, గంగారం
‘టీ’ తో ఉల్లాసం..
చలికాలంలో దాహం వేయకపోయినా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్ టీ తాగితే ఉత్సాహంగా ఉంటుంది. అల్లం, తులసి, దాల్చిన చక్కతో తయారు చేసిన చాయ్ తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. మలినాలను దేహం నుంచి బయటకు పంపడంలో ఇది సహాయ పడుతుంది. దీంతో పాటు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది. దీనిలో కొంచెం తేనే కలుపుకుంటే చాలా మంచిందంటున్నారు వైద్యులు.
రాత్రిపూట మితాహారం..
చలికాలంలో రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తక్కువగా తింటూ రుచులను అస్వాదించాలి. చాలా మంది రాత్రి వేళల్లో మాంసాహారం ఇష్టపడుతారు. సూప్ ఎక్కువ గా తీసుకోవద్దు.. నాన్‌వెజ్ తింటే ఫ్రూట్స్, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే హోటల్‌కు ,పార్టీలకు వెళ్లినప్పుడు వేపుళ్లను దూరంగా పెడితే మంచింది. ఆవిరిపట్టిన, ఉడకబెట్టిన వంటకాలనే తీసుకోవాలి. దాబాల్లో, హోటల్ళ్లలో మైదా రొట్టెలను బాగా వాడు తున్నారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంట్లోనైనా గోధుమ రొట్టెలనే తినండి. అది కూడా నూనె లేకుండా చేసినవే. సోయాబిన్ పిండి బరువును తగ్గిస్తుంది. ఆరోగ్య ప్రదాయిని కూడా. వారానికి కొకసారైనా జొన్న పిండితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇందులో కాల్షి యం పుష్కలంగా ఉంటుంది.
ఉత్తేజానికి యాలకులు, తేనే..
డ్రైఫ్రూట్స్ మేలు…
చలికాలంతో పాటు ఏకాలంలోనైనా కాయగూరలు, డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాయగూరలను, డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటుంది. అంతేకాదు చలికాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ బారినుంచి కూడా రక్షణ పొందవచ్చు. తాజా కాయగూరలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బయటనుంచి వచ్చే చలి తీవ్రతను క్రమబద్దం చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి దోహదపడతాయి.
దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహదపడుతాయి. చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా శరీరం బద్దకించడం మామూలుగా కనిపిస్తునే ఉంటుంది. ఇలాంటి సమయంలో గ్లాసు నీటిలో రెండు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగితే ఉత్తేజంగా ఉండవచ్చనీ, దీనికి కొంచెం తెనెను కలిపి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుందని పకృతి వైద్యులు అంటున్నారు.