ఒకవైపు నకిలీ విత్తనాలు.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు.. రైతన్నలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. విత్తనాల కొనుగోలు మొదలు పంటల అమ్మకాల వరకు అన్నదాతలు ఏదోరూపంలో మోసపోతూనే ఉన్నారు. రైతులను కంటికిరెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మాత్రం మొక్కుబడి చర్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తన డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ కర్షకులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. నకిలీ, బ్లాక్ దందాను అరికట్టాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు, అడపాదడపా కేసులు నమోదు చేస్తూ మిన్నకుండిపోతున్నారు. ఏదేమైనా అన్నదాతల కష్టాలను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రతి ఏడాది వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : విత్తన డీలర్లకు పరీక్షలు పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి, ఎన్ని సమావేశాలు పెట్టినా అవి మొక్కుబడిగానే మిగిలిపోతున్నాయి. రైతన్నలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నకిలీ విత్తనాలు, బ్లాక్‌లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. వానకాలం సీజన్ వచ్చినప్పుడల్లా టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేయడం, మొక్కుబడి తనిఖీలు చేయడమే తప్ప నకిలీలను పట్టుకొని కేసులు పెడుతున్న సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో రైతులు బ్లాక్‌లో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయలేక పెట్టుబడి తలకు మించిన భారంగా మారుతున్నది. రైతులకు మరింత మేలు చేకూరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలేమో గానీ ఇబ్బందులు బాగా కనిపిస్తున్నాయని రైతులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుబంధు సొమ్ములు ఖాతాల్లో జమకాకపోవడంతో పెట్టుబడికి నానా కష్టాలు పడుతున్నారు.
అధికారుల చూపు నకిలీ విత్తనాలపైనే ఉంది. కానీ.. బ్లాక్ మార్కెట్లో విత్తన విక్రయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా విత్తన, ఎరువుల షాపులను తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నది. రైతులకు కావాల్సిన విత్తనాలు వారికి అందడం లేదు. ఇదే అదునుగా విత్తన డీలర్లు బ్లాక్‌లో ఎక్కువ ధరకు విత్తనాలను విక్రయిస్తున్నారు. పత్తి యూఎస్ 7067 రకం దిగుబడి ఎక్కువ ఉందని రైతులు అడుగుతుండడంతో డీలర్లు మాత్రం స్టాక్ లేదంటూ వేరే విత్తనాలను అంటకడుతున్నారు.

ఆర్సీహెచ్ 659 రకం కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ రకం విత్తనాలను బ్లాక్ చేసి ఎంఆర్పీ కంటే మూడు రెట్లు ఎక్కువగా విక్రయిస్తున్నారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో రూ.1,800 నుంచి రూ.2,000 వరకు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. కొత్తగూడెం, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి మండలాల్లో ఇలాంటి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతున్నది. రైతులు చేసేదేమీలేక ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 4,87,312 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు ప్రణాళికను తయారు చేశారు. ఇందుకోసం 4,394 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పత్తి 2,16,625 ఎకరాల్లో పంటను సాగు చేయనున్నారు.
దీనికిగాను 5,41,560 ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుంది. వరి 1,65,854 ఎకరాలకు 41,464 క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి ఉంది. మొక్కజొన్న 60,200 ఎకరాలకు 4,816 క్వింటాళ్ల విత్తనాలు, మిర్చి 32,168 ఎకరాలకు 32 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. డీలర్ల వద్ద సరిపడా అందుబాటులో ఉంచారు. అయితే విత్తనాల కొరత ఎట్లా వస్తుంది అనేది ఆ శాఖ అధికారులకే తెలియాలి. అవసరం ఉన్న విత్తనాలు తేకుండా డిమాండ్ లేని విత్తన రకాలు మార్కెట్లోకి తీసుకొచ్చి క్వింటాళ్ల లెక్కలు చూపెట్టడం వల్ల రైతులకు కావాల్సిన విత్తనాలు దొరకడం లేదు.
మాకు కావాల్సిన విత్తనాలు అడిగితే లేవంటున్నారు. 7067 రకం రూ.2 వేల వరకు అమ్మేస్తున్నారు. అంత రేటు పెట్టి కొని వ్యవసాయం ఎట్లా చెయ్యాలి. పోయిన సంవత్సరం పత్తి మీద చాలా నష్టం వచ్చింది. కూలీలు కూడా సరిగా దొరకరు. బయట నుంచి తేవాల్సి వస్తున్నది. మిర్చి వేస్తే వైరస్ వచ్చి పోయింది. మాకు సలహాలు ఇచ్చే వాళ్లు లేరు. పత్తికి ప్రభుత్వం రేటు పెంచాలి.
– జోయినబోయిన ఐలయ్య, రైతు, డేగలమడుగు
కొంతమంది వ్యాపారులు విత్తనాలను కావాలనే బ్లాక్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో రైతులు ఎక్కువ ధరకు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. అధికారులు షాపులను తనిఖీ చేస్తూనే ఉన్నారు.. అయినా వారి కన్నుగప్పి కొందరు బ్లాక్ వ్యాపారం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి విత్తనాలు వస్తున్నట్లు తెలిసింది. అధికారులు పక్కగా నిఘా పెడితే తప్ప సమస్య పరిష్కారం కాదు.
– ఇస్లావత్ బాలు, సంపత్‌నగర్, టేకులపల్లి మండలం
నకిలీ విత్తనాలు ఎక్కడా లేవు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అన్ని షాపుల వద్ద విత్తనాలు, ఎరువులు ఫుల్‌గా ఉన్నాయి. బ్లాక్‌లో అమ్ముతున్నారు అనేది వాస్తవం కాదు. సమాచారం ఇస్తే రైతుల పేర్లు చెప్పకుండా తనిఖీలు చేస్తాం.. షాపును సీజ్ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తాం.
– బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం