ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 04 : ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ముష్కరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా నలుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఆర్టీఏ అధికారులుగా చలామణి అవుతూ జాతీయ రహదారిపై వాహనాలను ఆపుతూ దారి దోపిడికి పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఖమ్మంలో రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల మోహన్, ఏదులాపురం మున్సిపాలిటీకి పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఆత్కూరి నవీన్, కూసుమంచి మండలం బోడియ తండాకు చెందిన జాటోత్సాగర్, ఆదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని భారీ కూడానికి చెందిన దంతాల వెంకట్ నారాయణ ముఠాగా ఏర్పడి దారి దోపిడీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీశైలం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ముఠా సభ్యులు గతంలో తిరుమలయపాలెం మండలంలో హోటల్ నిర్వాహకుడిని బెదిరించి రూ.8 వేలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.