అశ్వారావుపేట, జనవరి 13 : రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన అంతా మోసమేనని, ఇచ్చినవన్నీ బోగస్ హామీలేనని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సోమవారం భోగి పండుగను పురస్కరించుకుని రేవంత్‌రెడ్డి మోసపూరిత హామీల పత్రాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రావు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలకు కోతలు విధించి ప్రజలను అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజలు, రైతులు కాంగ్రెస్ పాలనలో దగా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రస్తుతం రాక్షసపాలన సాగుతోందని అసంతృప్తి వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిత్యం పోరాడుతూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ర్టానికి భవిష్యత్ కేసీఆరేనని, ఆయనతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యవరపు సంపూర్ణ, మోటూరి మోహన్ పాల్గొన్నారు.