మామిళ్లగూడెం, ఏప్రిల్ 19: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారు పెడుతున్న ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందా లు కచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకరనంద్ మిశ్రా ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ట్రాన్జాక్షన్లు, అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్‌దత్‌తో కలిసి ఖమ్మం ఐడీవోసీలో ఖర్చు నిఘా బృందాలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అన్ని బృందాలూ సమన్వయంతో విధు లు నిర్వర్తించాలని సూచించారు. డబ్బు, మద్యం, ప్రలోభాల రహిత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఎస్ఎస్టీల ప్రదేశాలు మార్చుతూ ఉండాలన్నారు. జప్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెద్ద మొత్తంలో నగదు జప్తు జరిగినప్పుడు ఐటీ శాఖకు సమాచారమిచ్చి నిబంధనలను పాటించాలని సూచించారు. ర్యాలీ లు, సమావేశాలు నిర్వహించిన పార్టీ ప్రచార ఖర్చులను నిర్ణయించిన ధరల ప్రకారం నమోదు చే యాలన్నారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా రోజువారీ దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయన్నారు. వీటిల్లో 24 ఫ్లయింగ్ స్వాడ్లు, 45 ఎస్ఎస్టీ బృందాల పటిష్ట నిఘా ఏర్పాటుచేశామని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను, విధుల్లోని నిఘాల బృందాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సువిధ సింగిల్ విండో ద్వారా ఎన్నికల సంబంధ అన్ని అనుమతులనూ జారీ చేస్తున్నట్లు తెలిపారు.
సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ.. జిల్లాలో 12 ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారని, పోలింగ్‌కు ముందు డ్రై డే నాడు మిర్రర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర అధికారులు మురళీధర్‌రావు, కే.శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.