రఘునాథపాలెం/పెనుబల్లి/ ఖమ్మం రూరల్, ఆగస్టు 2: పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు అడ్డగించారు. మాజీ సర్పంచ్‌లందరూ హైదరాబాద్‌కు బయలుదేరారని తెలుసుకున్న పోలీసులు.. వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. రఘునాథపాలెం, పెనుబల్లి మండలాల నుంచి బయలుదేరిన మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
రఘునాథపాలెం మండలం నుంచి రాజధానికి పయనమై వెళ్తున్న మాజీ సర్పంచ్‌లను ఆ మండల పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సందర్భంగా సర్పంచ్ల (మాజీ) సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్ మాట్లాడారు. తాము సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పనులను త్వరగా పూర్తి చేసేందుకు తమ సొంత నిధులు వెచ్చించామని అన్నారు. అయితే నెలల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం తమ బిల్లులు చెల్లించడం లేదని, కనీసం వాటిపై స్పందించడం లేదని ఆరోపించారు.
కొన్నిచోట్ల వడ్డీలకు తెచ్చి పనులు పూర్తి చేసినందుకు వెంటనే తమకు ఆ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయా మండలాల నుంచి పోలీసుల అదుపులో ఉన్న మాజీ సర్పంచుల్లో చెరుకూరి ప్రదీప్, కొర్లపాటి రామారావు, షేక్ మీరా సాహెబ్, గుగులోతు మోతీలాల్, ధరావత్ పాండు తదితరులు ఉన్నారు. ఖమ్మం రూరల్‌కు చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌లు వెంకటరమణ, తాటికొండ సుదర్శన్, బాలునాయక్‌లను ఎస్సై రామారావు ముందస్తు అరెస్ట్ చేశారు.