ఖమ్మం, నవంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యజమానులు సంతోషంగా ఉంటారని రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా చేపట్టిన పాదయాత్రను సోమవారం ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రైవేటు కళాశాలల యజమానులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
అంతకుముందు జడ్పీ ఆవరణం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రైవేటు కళాశాలలకు దాదాపు రూ.12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, తొమ్మిది నెలలుగా సిబ్బందికి జీతాలు లేవని అన్నారు. ప్రైవేటు కళాశాలలకు దాదాపు రూ.1,800 కోట్లకు టోకెన్లు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదని అన్నారు. దీంతో యజమాన్యాలు ధర్నాలు చేస్తే రెండుసార్లు కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు తప్ప బకాయిలు మాత్రం చెల్లించలేదని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే దాదాపు రూ.10 వేల కోట్లు బిల్లులు వచ్చాయని, ఆయనకు సంబంధించిన కంపెనీకి వేల కోట్లు అప్పగిస్తున్నారని తెలిపారు. పొంగులేటిది ఒక బిల్లు ఆపితే తెలంగాణలోని విద్యార్థులందరి జీవితాలు బాగుపడతాయన్నారు. మంత్రుల బినామీలకు మాత్రం డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. ఇదేమిటని అడిగితే బెదిరిస్తున్నారని అన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కళాశాలల యజమానులకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేపట్టిన రాకేష్ దత్తా మాట్లాడుతూ మంత్రి పొంగులేటిపై ఉన్న అభిమానం విద్యార్థులపై రేవంత్‌కు లేదన్నారు. విద్యార్థులతో కలిసి నాయకులు పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, అమరగాని వెంకన్నగౌడ్, దాదె అమృతమ్మ, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, సద్దాం, మహమ్మద్ రఫీ, షారుక్, నెమలికొండ వంశీ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.