ఖమ్మం, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు సిద్ధమైన ప్రభుత్వ ప్రయత్నాలకు బీఆర్ఎస్ అడ్డుకట్ట వేయడాన్ని స్వాగతిస్తూ.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం సంబురాలు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఎదుట తమ వాదనలు బలంగా వినిపించి చార్జీలు పెరగకుండా.. భారం పడకుండా చేసిన బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచిందని పలువురు నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి.. టపాకులు కాల్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నాయకులు బెల్లం వేణు, బిచ్చాల తిరుమలరావు, ఉబ్బలపల్లి నిరోషా, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో సీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో టపాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. మధిర పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎర్రుపాలెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు మంతపురి రాజుగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో స్వీట్లు పంపిణీ చేశారు. కారేపల్లి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.