అశ్వారావుపేట, డిసెంబర్ 8 : పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు.. పోటీ చేస్తున్న అభ్యర్థులను గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి. పల్లె పోరులో ఎక్కువగా వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అయితే.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు దగ్గరి పోలికలున్న గుర్తులను కేటాయించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ పేర్లుగానీ, ఫొటోలుగానీ లేకుండానే బ్యాలెట్ పేపర్లు ఉండడంతో వృద్ధులు, నిరక్షరాస్యులు తమ ‘గుర్తు’లను ఎలా గుర్తుపడతారోనని అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఓటరు నాడి దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రచారంలో ఎక్కువ గుర్తులపైనే ఫోకస్ చేస్తుండడం వారికి మరో సవాల్‌గా మారింది.
గ్రమ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, ఫొటోలు లేకుండానే అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం కేటాయించిన గుర్తులతోనే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. కానీ, కేటాయించిన గుర్తులు ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దగ్గరి పోలికలున్న గుర్తులు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఓటును ఏ గుర్తుకు వేస్తారోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
వృద్ధులు, నిరక్షరాస్యులు గుర్తులను ఎలా గుర్తు పడతారన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో 48 గంటలు మాత్రమే మిలిగి ఉన్నాయి. నేటితో ప్రచారం కూడా ముగుస్తోంది. మరోవైపు రెండో విడత ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 14న రెండో విడత పోలింగ్ జరుగనుంది. ఆ తరువాత మూడు రోజులకు మూడో విడత పోలింగ్ కూడా ఉంది. ఈ దశలో అభ్యర్థులు తమ ప్రచారంపై కంటే గుర్తులను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకే తంటాలు పడుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు అధికారులు కేటాయించిన గుర్తుల్లో కొన్ని ఒకే రకంగా కనిపిస్తున్నాయి. అవి దగ్గర పోలికలతో ఉన్నాయి. వీటిని గుర్తించి ఓటు వేసే సమయంలో వృద్ధులు, నిరక్షరాస్యులు కొంత అయోమయానికి గురయ్యే అవకాశాలున్నాయి. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పాన్సర్ వంటి 30 రకాల గుర్తులను కేటాయించారు. దీంతోపాటు వార్డు అభ్యర్థులకు గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల వంటి 20 గుర్తులు ఉన్నాయి.
బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసే సమయంలో ఓటర్లు గుర్తులను మర్చిపోకుండా అభ్యర్థులు అవగాహన కల్పించుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన టేబుల్, పలక, బిస్కెట్, మంచం, నల్లబోర్డు వంటివి ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తే తాము అనుకున్న అభ్యర్థికి ఓటు పడకపోగా.. తాను అనుకోని వ్యక్తికి ఓటు పడే ప్రమాదం ఉంటుంది. బ్యాట్‌కు, స్పాన్సర్‌కు, బ్యాటరీ లైటుకు, బ్రష్‌కు, చెత్త డబ్బాకు, బక్కెట్‌కు దగ్గర పోలికలున్నాయి. ఈ విధంగా దగ్గర పోలికలున్న గుర్తులతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఇక వార్డుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ స్టవ్, గరాటా, స్టూల్, బీరువా, పోస్ట్ డబ్బా, గాజు గ్లాసు వంటి గుర్తులు కూడా దగ్గర పోలికలతో ఉండడం గమనార్హం.
కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు గుబులు చెందుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు చూసేందుకు దగ్గర పోలికగా ఉండడంతో సదరు గుర్తు గురించి ఓటర్లకు స్పష్టంగా చెప్పాల్సి వస్తోంది. దీనిలానే మరికొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. ఫలానా గుర్తు అని చెపితేనే గానీ అర్థం చేసుకోలేనివి ఉన్నాయి. రెండు గుర్తుల్లో తేడా ఉన్నప్పటికీ కంటి చూపు సరిగా లేని వృద్ధులకు అవి ఒకేలా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి గుర్తులు అభ్యర్థుల ఆశలను తలకిందులు చేస్తాయోమోనన్న భయం అటు అభ్యర్థుల్లోనూ, ఇటు రాజకీయ పార్టీ నాయకుల్లోనూ నెలకొంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే గుర్తుల కేటాయింపులు జరిగాయి. గుర్తుల ఎంపిక పూర్తి బాధ్యత ఎన్నికల సంఘానిదే. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం కేటాయించిన గుర్తుల ఆధారంగానే పోలింగ్ నిర్వహించనున్నాం.
-అప్పారావు, ఎంపీడీవో, అశ్వారావుపేట