సారపాక/ మణుగూరు టౌన్, అక్టోబర్ 9: అర్హులెవరూ అధైర్య పడాల్సిన పనిలేని, ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, విడతల వారీగా ప్రతి కటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో భాగంగా పినపాక నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు పథకం మంజూరైనట్లు తెలిపారు. మణుగూరులోని వాసవీనగర్ గిరిజన భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా 10,500 మంది దళిత కుటుంబాలు ఉన్నాయని, వీరిలో ఈ రెండో విడతలో 1,100 మందికి దళితబంధు మంజూరైందని, వీరి బ్యాంకు ఖాతాల్లో రెండు రోజుల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. మిగిలిన వారికి త్వరలోనే దశలవారీగా అందిస్తామని అన్నారు. దళితులందరూ పనిచేసే ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు అధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, కారం విజయకుమారి, ముత్యం బాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు, జావేద్‌పాషా, యూసఫ్ షరీఫ్ పాల్గొన్నారు.
కులవృత్తులకు పూర్వ వైభవం
తెలంగాణలోనే కులవృత్తులకు పూర్వ వైభవం లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. మణుగూరు మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. గిరిజన భవన్లో బీసీ కులవృత్తుల ఆర్థికసాయం పథకంలో భాగంగా నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రూ.2 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.