భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం వస్తే చాలు.. అక్కడి ప్రజలకు తిప్పలు తప్పవు. బాహ్య ప్రపంచంతో సంబంధాలూ ఉండవు. రాకపోకలకు అంతరాయం. లేదంటే అతికష్టమ్మీద మరో పది కిలోమీటర్ల చుట్టూ ప్రయాణం. ఇదీ.. కిన్నెరసాని ప్రాజెక్టు దిగువన ఉన్న 20 గ్రామాల పరిస్థితి. ఈ పరిస్థితి గమనించిన గత కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లోనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు సమీపించడం, నియమావళి సహా ఇతరత్రా కారణాలతో పనులు అక్కడే ఆగిపోయాయి. ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు దాటినా ఆ వంతెన నిర్మాణ పనులు మొదలైన పాపాన పోలేదు.
భారీ వర్షాలకు కిన్నెరసాని ప్రాజెక్టులోకి ఏటా వరద నీరు చేరుతుంటుంది. దీంతో రాజాపురం-యానంబైలు మధ్యలో ఉన్న లోలెవల్ కాజ్వే నీట మునిగిపోతుంటుంది. దీంతో పరిసర గ్రామ ప్రజలు మండల కేంద్రమైన పాల్వంచకు గానీ, అత్యవసర పనులపై ఇతర ప్రాంతాలకు గానీ రాకపోకలు సాగించేందుకు అంతరాయం కలుగుతుంది. మరీ అత్యవసరమైతే కిన్నెరసాని డ్యామ్పైన ఉన్న వంతెన నుంచి తిరిగి రావాలి. లేదంటే పది కిలోమీటర్ల దూరం వెళ్లి పాల్వంచకు చేరుకోవాలి. ఎన్నో ఏళ్ల ఈ సమస్యపై గత కేసీఆర్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రూ.10 కోట్ల నిధులతో యానంబైలు వద్ద వంతెన నిర్మాణం చేపట్టింది. 2023 చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నియమావళి సహా వివిధ కారణాలతో పనులు ఆగిపోయాయి. కానీ.. నూతన ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నా మీనమేషాలు తప్ప ఆచరణ లేకపోయింది. అలాగే, సుజాతనగర్ మండలం వేపలగడ్డ వద్ద చేపట్టిన భారీ వంతెన నిర్మాణ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ముక్కు ఎక్కడుందిరా అంటే తలచుట్టూ తిప్పి చూపించనట్టుగా అవుతుంది యానంబైలు పరిసర ప్రాంతాల ప్రజల పరిస్థితి. యానంబైలు పరిసర ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పాండురంగాపురం నుంచి మండల కేంద్రమైన పాల్వంచకు, ఆపై బాహ్య ప్రపంచానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏటా వరదలకు, భారీ వర్షాలకు యానంబైలు చప్టా మునుగుతుంది. అందుకే గత కేసీఆర్ ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టింది. ఇప్పుడిది పూర్తి కాకుంటే ఈ 20 గ్రామాల ప్రజలకు ఈ ఏడాది కూడా నరకమే. యానంబైలు, ఉల్వనూరు, రేగులగూడెం, మొండికట్ట, రెడ్డిగూడెంతోపాటు మరో పది గ్రామాల ప్రజలు పాల్వంచకు వెళ్లలేరు. రాకపోకలు ప్రశ్నార్థకమవుతాయి.
వర్షాలకు వరదలొస్తే మా గ్రామం నుంచి పాల్వంచ వెళ్లలేం. ఎంత కష్టమొచ్చినా భరించి ఇక్కడే ఉండాలి. వరద తగ్గాకే వెళ్లాల్సి ఉంటుంది. మంచి నాయకులు ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మాకు శనిలా ఉండే నాయకులు వస్తే ఇలానే ఉంటుంది. ఇన్ని రోజులుగా బ్రిడ్జిని కడుతూనే ఉన్నారు. పాలకులుగానీ, అధికారులుగానీ మా ఊరికి వస్తే తెలుస్తుంది మా కష్టాలేమిటో.
సరైన వంతెన లేక మేము పడుతున్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు పాలకులు గానీ, ఇటు అధికారులుగానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. కనీసం మా ఊరు ఊరంతా కొటుకుపోతేనైనా మా కష్టాలు తెలుస్తాయో ఏమో అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా కష్టాలు పడుతూనే ఉన్నాం. బ్రిడ్జి వచ్చిందనుకుంటే ఆ కాంట్రాక్టరేమో ఇప్పటికీ పూర్తి చేయట్లేదు.