బోనకల్లు, మే 23 : పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ బోనకల్లు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ… గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు అన్నింటిని క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు నియామక తేదీని అక్టోబర్ 10గా పరిగణించాలని, డీఎస్సీ 2008 టీచర్లకు జీతాలు ఇవ్వాలని, వారిని విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం, విద్యార్థుల నమోదు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇందులో సమాజం కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. గురుకుల పాఠశాలల సమయ పాలనను మార్చాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకుడు సద్దా బాబు, మండల అధ్యక్షుడు చిన్న రంగారావు, ఉపాధ్యక్షుడు పి.గోపాలరావు, కోశాధికారి జె.కోటయ్య, మండల కార్యదర్శులు పి.నరసింహరావు, కె.సురేశ్, ఉయ్యాల రామారావు, ఎం.నిర్మల, కె.పద్మావతి, ఎం.నరేంద్ర సింహం, యు.గంగాభవాని, ఎం.లవకుశ పాల్గొన్నారు.