పాల్వంచ/ మణుగూరు టౌన్, జూలై 9 : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లోని కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కేటీపీఎస్, బీటీపీఎస్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసనలు గురువారం 15వ రోజుకు చేరాయి. పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
మణుగూరు బీటీపీఎస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విద్యుత్ యాజమాన్యాల మొండి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జేఏసీ బీటీపీఎస్ రీజినల్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్‌లో చేపడుతున్న పాక్షిక ప్రైవేటీకరణ విధానాన్ని ఇతర విద్యుత్ కేంద్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఆరోపించారు.
ముఖ్యంగా బీటీపీఎస్‌కు ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యాలు వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ చైర్మన్ రాజేందర్, యస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, రాజేశ్, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, సీతారామిరెడ్డి, తిరుపతి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, సయ్యద్, భాగ్యరాజు, పావని, లక్ష్మి, రిజ్వాన, రవిప్రసాద్, మహేశ్, నవీన్, ప్రసాద్, సత్యనారాయణ, శోభన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.