అశ్వారావుపేట, జూలై 9: భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్/ సర్) ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెల 25 నుంచి ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటర్ల ఇంటికి వచ్చి గణన పత్రాన్ని ఇప్పటికే అందించారు.
స్వీకరణ, ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే, సరైన అవగాహన లేని చాలామంది ఓటర్లు ఈ గణన ఫారాన్ని నింపేందుకు తికమకపడుతున్నారు. ఫారాన్ని సమగ్రంగా నింపకపోతే ఓటు తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల అవగాహన కోసం ప్రత్యేక కథనం.
ఎన్యూమరేషన్ ఫాం అంటే? ఇది ఓటరు జాబితాను ధ్రువీకరించడంతోపాటు ఓటరు వివరాలు సేకరించేందుకు ఎన్నికల సంఘం వినియోగించే ప్రధానమైన ఫారం. ఒక ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఈ ఫాం ప్రామాణికం. ఫారంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి. ఫారం నింపడానికి ఇబ్బందైతే బీఎల్వోల సహకారం తీసుకోవచ్చు.
ఫారం పైభాగంలో..
2026 జాబితాలోని ఓటరు పేరు, ఓటరు ఫొటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం పేరు వంటి వివరాలు ఉంటాయి. ఓటరు పాత ఫొటోతో ముందుగా వివరాలు ముద్రించి ఉంటాయి. ఇక్కడే పాత ఫొటో ఉంటుంది. దాని పక్కనే ఓటరు తాజా ఫొటో అంటించాలి.
రెండో భాగంలో..
రెండో భాగం రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్న వారికి కోసం మొదటి బాక్స్. 2002లో ఓటు లేనివారి కోసం పక్కనే రెండో బాక్స్ ఉంటాయి. ఈ రెండు అంశాల్లో ఒక దానిని ఎంపిక చేసుకుని వివరాలు నింపాలి.
2002 ఎస్ఐఆర్ నాటి
జాబితాలో ఓటు ఉంటే..
2002 ఓటరు జాబితా ఆధారంగా ఈ బాక్సులో వివరాలు నింపాలి. ఓటరు పేరు, గుర్తింపు కార్డు నంబరు, సంరక్షకుడి పేరు, వారితో ఉన్న బంధుత్వం వివరాలు నమోదు చేయాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్, క్రమ సంఖ్య (ఓటరు జాబితాలో ఓటరు సీరియల్ నంబర్)తో పూరించాలి.
2002 జాబితాలో ఓటు లేకపోతే..
2002లో జాబితాలో ఓటు లేకపోతే ఓటరు తండ్రి, తల్లి, తాత, నానమ్మలలో ఒకరి వివరాలను 2002లో ఓటర్ల జాబితా ప్రకారం బాక్స్‌లో నమోదు చేయాలి. పేరు ఉన్న చోటు వీరిలో ఒకరి వివరాలు పూరించాలి. బంధువు అన్న చోట తండ్రి లేదా భర్త పేరు నింపాలి. 2002లో మీకు ఓటు లేనందున మీ బంధువు వివరాలు బాక్స్‌లో పూర్తి చేయాలి.
మూడో భాగంలో..
మూడో భాగంలో ఓటరు ప్రస్తుత వివరాలను నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటు గుర్తింపు కార్డు నంబరు, తల్లిదండ్రుల పేర్లు, వారి ఓటు గుర్తింపు కార్డుల నంబర్లు, వివాహం అయితే భాగస్వామి పేరు, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబరు వంటివి పూరించాలి. వివాహం కాని వారు ఆ బాక్స్‌ను ఖాళీగా వదిలేయాలి.
వ్యక్తిగత వివరాలు..
ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఎస్ఐఆర్’ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. బీఎల్వోలు అందించిన ఫారాలను జాగ్రత్తగా పూర్తిచేయాలి. అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను జతచేయాలి. తప్పుడు వివరాలు నమోదు చేయకూడదు. ఏమైనా సందేహాలుంటే బీఎల్వోలను అడిగి తెలుసుకోవాలి. సర్వేను విజయవంతం చేసేందుకు ఓటర్లు సహకరించాలి.
-దాసరి కిశోర్, తహసీల్దార్, అశ్వారావుపేట