ఖమ్మం, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, అధికారుల నియామకాలను పూర్తిచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో నాల్గోవిడత మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీకానుంది. అదేరోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 25 చివరితేదీ కాగా ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఉంది.
షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి ఖమ్మంజిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడిజిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖమ్మం లోక్‌సభ పరిధిలోకి 7 నియోజకవర్గాలు వస్తాయి. మరో 3 నియోజకవర్గాలు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నెలరోజుల క్రితమే సమాయత్తమై పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ప్రస్తుత ఎంపీ, బీఆర్ఎస్ లోకసభ పక్షనేత నామా నాగేశ్వరరావును మరోసారి అభ్యర్థిగా ప్రకటించారు.
నామా అభ్యర్థిత్వం పార్టీలో ఉత్తేజం నింపగా ఖమ్మంలో పార్టీ శ్రేణులు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 1 లక్షా 66వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన నామా ఈసారి అదే రీతిలో గెలిచే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విజయాలు, లక్ష్యాలను ప్రచారం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిని ఇప్పటివరకు నిర్ణయించకపోవడంతో ఆయా పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
ఖమ్మంజిల్లాలో ఒకప్పుడు కీలకంగా ఉన్న వామపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి నడుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వ్యూహ, ప్రతివ్యూహాలపై కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గాల్లో గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య సుమారు 5 వేల వరకు పెరగడంతో అధికారులు ఆ దిశగా సమాయత్తమవుతున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటివద్దనే ఓటువేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని తెలిపింది.
లోక్‌సభ నియోజర్గవ్యాప్తంగా అధికారులు తుదిఓటర్ల జాబితాను రూపకల్పన చేశారు. 7 నియోజకవర్గాల్లోని 1,893 పోలింగ్స్టేషన్లలో ఓటర్ల జాబితాను సవరించారు. నియోజకవర్గాల్లోని ఈఆర్వోలు, ఏఈఆర్వోతోపాటు బూత్‌లెవల్ అధికారులకు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. తుది ఓటర్ల జాబితాను అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రచురించారు. పురుషులు-7,89,130 మహిళలు-8,35,878 మంది ఓటర్లు ఉన్నారు. వీరితోపాటు ట్రాన్స్జెండర్లు-127 వరకు తమ ఓటును నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,625,135 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు ప్రకటించారు.