మణుగూరు టౌన్, డిసెంబర్ 1: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో ఎలా పర్యటిస్తారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ సొమ్ముతో పర్యటనలు చేయడం దుర్మార్గమని, సీఎం పర్యటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఎన్నికలు రాగానే మంత్రులు, ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని, ఎన్నికల సంఘాలు సీఎం పర్యటనను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహిళలు ఓట్లు వేయాలని సీఎం పిలుపునిస్తే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి అందరూ సమానమేనని, సీఎం పర్యటనను కచ్చితంగా ఆపేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.