ఖమ్మం రూరల్, అక్టోబర్ 1: పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రచారంలో జనం నీరాజనాలు పలికారు. బుధవారం మండలంలోని ఏదులాపురం పంచాయతీలోని సత్యనారాయణపురం, చిన్నతండా, తాళ్లేసేతండా, ఇందిరమ్మ కాలనీల్లో ఎమ్మెల్యే కందాళ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీపీ బెల్లం ఉమాతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. తొలుత బైపాస్‌రోడ్‌లోని అభయాంజనేయస్వామి ఆలయంలో సత్యనారాయణపురం గ్రామ నాయకులు గూడ సంజీవరెడ్డి, నాగిరెడ్డి, తోట చిన్నవెంకటరెడ్డి, రామ్మూర్తి నాయక్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కందాళ రోడ్ షో ప్రారంభంమైంది. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు నినాదలతో సత్యనారాయణపురం పురవీధులు పులకించిపోయాయి. అనంతరం తాల్లేసేతండా, చిన్నతండా, ఇందరమ్మకాలనీల్లో ఎమ్మెల్యే రోడ్‌షో నిర్వహించారు.
అడుగడుగున మహిళలు బీఆర్ఎస్ నాయకులకు మంగళ హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కందాళ అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ చనిపోయే వ్యక్తి అని, ఇన్నాళ్లు మీలో ఒకడిగా ఉండి ఆపద సమయంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో కంటికి రెప్పలా కాపాడుకున్న వారు కావాలో చర్చ జరగాలన్నారు. పరాయి వాళ్ల పాలన పాలేరుకు అవసరం లేదని, ప్రతిపక్ష నాయకులు పాలేరు ప్రథమ పాధ్యాన్యత కాదని, వారికి పాలేరు ఒక అప్షన్ మాత్రమే అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద వ్యక్తికి రైతుబీమా తరహాలో రూ.5లక్షల కేసీఆర్ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ దేశానికి ఆదర్శం అయిందన్నారు. కార్యక్రమంలో నాయకులు దర్గయ్య, వెంపటి ఉపేందర్, మైబెల్లిసాహెబ్, గరుడ రమేష్, నారపాటి రమేశ్, మేకల ఉదయ్, కొట్టె నాగభూషణం పాల్గొన్నారు.
ఎన్నికల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కందాళకు సత్యనారాయణపురం గ్రామానికి చెందిన క్రీతికారెడ్డి తన కిడ్డీ బ్యాంక్(గురిగి)లో దాచుకున్న మొత్తాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రచార ఖర్చులకు నేను మీకు ఇస్తున్నా.. తాతయ్య అంటూ జీప్‌కు ఎదురొచ్చి మరీ అందజేశారు. చిన్నారి తండ్రి కరుణాకర్‌రెడ్డి, చిన్నారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.