ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లె పోరులో ఆఖరి విడత ప్రచారం పరిసమాప్తమైంది. మూడో విడత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో మైకులన్నీ మూగబోయినట్లయింది. దీంతో ప్రచారం అనంతరం కార్యాచరణపై పార్టీల నేతలు, అభ్యర్థులు దృష్టిసారించారు. మరోవైపు అధికారులు కూడా పోలింగ్ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు మంగళవారం పోలింగ్ సామగ్రితో సిబ్బంది బయలుదేరనున్నారు. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 పంచాయతీ స్థానాలకు బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, ఖమ్మంలో 1,372, భద్రాద్రిలో 1,071 వార్డుల స్థానాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టం బుధవారం జరుగనుంది. ఈ ఆఖరి దశలో ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లన్నీ పూర్తిచేస్తోంది. 1,700 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో ఈ చివరి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలున్నాయి. ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ కావడంతో అక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నిక జరగడం లేదు. ఇక 190 స్థానాలకు గాను 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, 361 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. తొమ్మిది వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో బుధవారం 168 సర్పంచ్ స్థానాలకు, 1,372 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాలైన జూలూరుపాడు, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్లలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడు మండలాల్లో 155 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో గుండాలలో 2, జూలూరుపాడు 2, లక్ష్మీదేవిపల్లి 3, సుజాతనగర్ 1, ఇల్లెందులో 2 కలిపి మొత్తం పది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాలకు 253 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, ఈ ఏడు మండలాల్లో 1,330 వార్డులకుగాను 256 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 1,071 వార్డులు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాలకు 1,330 మంది బరిలో ఉన్నారు. మండల కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని తీసుకొని మంగళవారం సాయంత్రం ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకోనున్నారు.