ముదిగొండ, మే 3: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకుడు కోల్టే అన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయా? లైటింగ్, తాగునీరు, శానిటేషన్ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. పోలింగ్ సమయం పెంచినందున దానికి అనుగుణంగా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం వల్లభి గ్రామంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించారు. నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేయాలని మద్యం, నగదు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి వస్తువులను తరలించినా వాటిని సీజ్ చేయాలని సిబ్బందికి సూచించారు.