Aasara Pension | ‘మొదట హామీ ఇవ్వడం.. తరువాత దానిని అటకెక్కించడం..’ అనేది కాంగ్రెస్ సర్కారు నానుడిగా మారుతోంది. ‘హస్త’వాసుల పాలనకు ఏడాది దాటిపోయినా వారి హామీల అమలుకు మాత్రం అతీగతీ లేకుండాపోతోంది. రోజులు, నెలలేగాక ఏకంగా ఏళ్లు కూడా దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆరు గ్యారెంటీల ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాది కాలం గడిచిపోయినా చివరికి ఒక్క హామీని కూడా చక్కగా అమలు చేసిన పాపానపోలేదు.
దీంతో పెంచిన పింఛన్ కోసం ఇన్నాళ్లూ ఆశగా ఎదురుచూసిన పండుటాకులు, వితంతువుల్లో తీవ్ర అసహనం పెల్లుబుకుతోంది. ఇక దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రూ.6 వేల పింఛన్‌పై వారు అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆఖరికి అవన్నీ అడియాశలవుతున్నాయి. పెంచిన పింఛన్‌ను అందించకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తుండడంతో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఇప్పటికే ఉన్న పింఛన్లకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఇవ్వకుండా ఏళ్లు గడుపుతున్న కాంగ్రెస్ సర్కారు.. ఇక కొత్తగా పెట్టుకున్న తమ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం కలిగిస్తుందోనంటూ కొత్త దరఖాస్తుదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రూ.2 వేల చొప్పున పింఛన్లు పెంచి ఇస్తామన్న మాట ఏమైందని, కొత్తలో ‘ప్రజాపాలన’ సభల్లో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 31 (నమస్తే తెలంగాణ)
గత కేసీఆర్ సర్కారు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.2,016, రూ.4,016 చొప్పున ఇస్తున్న ఆసరా పింఛన్లకు తాము మరో రూ.2000 కలుపుతామని, తాము అధికారంలోకి రాగానే రూ.4,016, రూ.6,016 చొప్పున పెంచిన పింఛన్లను జమ చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆసరా పింఛన్‌దారులకు అలా రూ.2 వేల ఆశచూపి అధికారంలోకి వచ్చింది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి దాకా పింఛన్ మొత్తాన్ని పెంచకుండా, దానిని లబ్ధిదారులకు జమ చేయకుండా చుక్కలు చూపిస్తోంది. ఇక వీరేగాక.. ఇవే పింఛన్ల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 45,332 మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు. వీరి పింఛన్లు ఇప్పటికే ఆమోదం పొందలేదు.
తమకెప్పుడు పింఛన్లు ఇస్తారోనంటూ వారు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక కొత్త పింఛన్ దరఖాస్తుదారులు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం మరోసారి అవకాశమిస్తే దరఖాస్తు చేసుకునేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మొన్నటి గ్రామాల్లో కేవలం నాలుగు పథకాల(ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా) పథకాలకు మాత్రమే ప్రభుత్వం నూతన దరఖాస్తులను ఆహ్వానించినప్పటికీ కొత్త పింఛన్ కోసం కూడా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అందించిన రూ.2,016, రూ.4,016 పింఛన్లే ఇప్పటికీ దిక్కవుతున్నాయి. రేవంత్ సర్కారు హామీ ఇచ్చిన పెంచిన పింఛన్ మొత్తం ఎప్పుడు జమ అవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పింఛన్ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన ప్రతి సమయంలోనూ బ్యాంకు అధికారులను; గ్రామంలో కలిసిన ప్రతి సందర్భంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ‘పెంచిన పింఛన్ జమ అయిందా?’ అంటూ ఆశగా, అమాయకంగా బ్యాంకర్లను అడుగుతుండడం, ‘కొత్త పింఛన్ పడలేదు. పాత పింఛనే జమ అయింది’ అంటూ వారి సమాధానం చెబుతుండడం, నిట్టూర్చుకుంటూ పింఛన్‌దారులు వెనుదిరుగుతుండడం వంటి దృశ్యాలు బ్యాంకుల్లో విరివిగా కన్పిస్తూనే ఉన్నాయి.
తమది ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయి రెండు నెలలు అవుతోంది. కానీ.. ఇప్పటికీ ఆసరా పింఛన్‌దారులకు గత కేసీఆర్ ప్రభుత్వం నాటి పాత పింఛనే అందుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,16,999 మంది ఆసరా పథకం పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ఇప్పటికీ రూ.2,016, రూ.4,016 చొప్పున ప్రతి నెలా రూ.26.49 కోట్లు జమ అవుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం నాటి నుంచి వస్తున్న ఈ మొత్తమే ఇప్పటికీ జమ అవుతోంది. కానీ.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం రూ.2 వేల చొప్పున పింఛన్ పెరగలేదు. జమ కావడం లేదు.
కొత్త పింఛన్ ఎప్పుడొస్తదని అధికారులను అడిగినా, నాయకులు అడిగినా ‘వస్తది వస్తది’ అంటూ సమాధానం ఇస్తున్నారు తప్ప ఇప్పటికీ రావడం లేదు. గ్రామసభల్లో చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. నాకు వినపడదు. మతి సరిగ్గా ఉండదు. దివ్యాంగుడి కోటాలో ఆసరా పింఛన్ రావాలి. నా ఆరోగ్యం అసలు బాగాలేదు. సర్కారు ఇచ్చే పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను.
-బట్టు సత్యప్రసాద్, లచ్చగూడెం, టేకులపల్లి
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ మొత్తాన్నే ఇప్పటికీ ఇస్తున్నారు. మాట ఇచ్చిన ప్రకారం పింఛన్ పెంచి ఇస్తామని కొత్త ప్రభుత్వం చెప్పింది. కానీ.. సంవత్సరం దాటిపోయినా ఇంకా ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వం రాగానే.. పెంచిన పింఛన్ ఇస్తుందని ఆశ పడ్డాను. బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారీ చెక్ చేసుకుంటున్నాను. కానీ.. పాత పింఛనే పడుతోంది.
-చలమల వెంకమ్మ, పోకలగూడెం, చండ్రుగొండ
ప్రజాపాలన గ్రామసభల్లో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంది. ఇక కొత్త పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందుతాయి.
-విద్యాచందన, అదనపు కలెక్టర్, భద్రాద్రి