ఖమ్మం, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 12న భదాద్రి కొత్తగూడెం, 18న ఖమ్మం జిల్లా పర్యటనలు ఖరారు కావడంతో ఏర్పాట్లపై ఆయా జిల్లాలో అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంతి పర్యటన ప్రాంతాలను, భద్రతా అంశాలను ఖమ్మం సీపీ విష్ణు వారియర్, భద్రాద్రి ఎస్పీ వినీత్‌లు సమీక్షిస్తున్నారు. సమీకృత కలెక్టరేట్లను పరిశీలించి బహిరంగ సభా స్థలాలను పరిశీలించారు. ఈ నెల 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంతోపాటు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్పాటు ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవత్ తదితరులు హాజరుకానున్నారు. నలుగురు సీఎంలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి రానుండడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్సాట్లు చేస్తున్నారు.
సోమవారం అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లు, ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న పనుల వివరాలను సమీక్షించారు. వచ్చే మూడు రోజుల్లో కలెకర్ కార్యాలయానికి సంబంధించిన అన్ని పనులూ పూర్తిచేయాలని ఆదేశించారు. నలుగురు ముఖ్యమంత్రులతోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కూడా ఈ సభలో పాల్గొననుండడంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి సభ దేశస్థాయిలో గుర్తింపు పొందేలా భారీ జన సమీకరణ చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావులు జనసమీకరణపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్‌తోపాటు సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనంలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించిన స్టేట్ చాంబర్లో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేందకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి విధుల్లోకి కలెక్టర్
వ్యక్తిగత కారణాలతో ఈ నెల 16 వరకు సెలవుపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం నుంచి విధుల్లోకి రానున్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయాల భవనం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఈ నెల 18వ తేదీని అధికారంగా ఖరారు చేయడం, సీఎం కేసీఆర్ సహా పలు రాష్టాల ముఖ్యమంత్రులు రానుండడంతో కలెక్టర్ వీపీ గౌతమ్ తన సెలవును రద్దు చేసుకొని మంగళవారం విధుల్లో చేరనున్నారు. ఆయన వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారు. కొత్త కలెకర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు మంగళవారం గదులను కేటాయించనున్నారు. సుమారు 46 ప్రభుత్వ శాఖలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే విధులు నిర్వహించన్నాయి.
కలెక్టరేట్ పక్కన సభ..
నూతన కలెక్టరేట్ ప్రారంభం అనంతరం పక్కనే 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగసభను కూడా నిర్వహించనున్నారు. ఈ సభా స్థలాన్ని, ఇతర ఏర్పాట్లను అదనపు డీసీపీ సుభాశ్‌చంద్రబోస్, మంత్రి అజయ్ పీఏ రవికిరణ్ తదితరులు సోమవారం పరిశీలించారు.