చండ్రుగొండ, డిసెంబర్ 21 : మామిడి తోటల్లో పూత ఆలస్యంగా వస్తుండడంతో సాగు రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి చెట్లకు పూత వస్తుంది. డిసెంబర్ గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పూత పూయకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. మామిడి తోటల్లో పూత వచ్చేందుకు, అరకొరగా పూసిన పూతను నిలిపేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. మందులు సైతం స్ప్రే చేయిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో 12 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 45 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అశ్వాపురం, పాల్వంచ, సుజాతనగర్, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో రైతులు ఎక్కువగా మామిడి సాగు చేస్తున్నారు. ఆయా తోటల్లో బంగినపల్లి, కేసరి, తోతాపురి, హిమాయత్, చిన్న, పెద్ద రసాలు లాంటి రకాలు ఉన్నాయి. అయితే గత ఏడాది వాతావరణ పరిస్థితులను బట్టి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల్లో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనతో ఉన్న మామిడి రైతులు తోటల్లో పూత ఆలస్యమవుతుండడంతో దిగుబడిపై దిగులు చెందుతున్నారు.
పూత వచ్చేందుకు, ఆపేందుకు మందుల పిచికారీ
వాతావరణ పరిస్థితులో, మరే కారణమోగానీ మామిడిలో అరకొరగా పూసిన పూతను ఆపేందుకు, కొత్తగా పూత వచ్చేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టి మూడు దఫాలుగా మందులు స్ప్రే చేస్తున్నారు. ప్లానోపిక్స్, క్లోరిఫైరిపాస్, దోమల నివారణకు ఇమడా, బూజు రాకుండా సాప్ పొడిలను కలిపి మామిడి చెట్లపై పిచికారీ చేస్తున్నారు. దీనికితోడు.. రసం పీల్చే నల్లి, పూతను తొలిచేందుకు పురుగులు ఆశించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి పూత వస్తే ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పై పరిస్థితులను బట్టి ఈ ఏడాది టన్ను దిగుబడి కూడా లభించడం కష్టమేనని వాపోతున్నారు.
కనిపించని ఉద్యానవన అధికారులు
మామిడి పంట సీజన్లో సాగు విధానంపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యానవన శాఖ(హార్టికల్చర్, అగ్రికల్చర్) అధికారుల పర్యవేక్షణ కొరవడిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పూత, కాత రాకపోవడానికి గల కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అధికారుల జాడ లేకపోవడంతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సాగు విధానంపై వివరించాలని కోరుతున్నారు.
మందులు పిచికారీ చేయించా..
ఇరవై ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నా. ఈ ఏడాది పూత ఆలస్యంగా వచ్చింది. అరకొరగా పూసిన పూతకు నల్లి, పురుగు ఆశించి తొలిచేస్తున్నాయి. రూ.2 లక్షలు వెచ్చించి క్లోరిఫైరిపాస్, సాప్ పొడి, ప్లానోపాస్, ఇమడా వంటి మందులను మూడు దఫాలుగా స్ప్రే చేశాను. సంబంధిత శాఖ అధికారులు గ్రామాల్లో మామిడి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది మామిడి దిగుబడి రావడం కష్టమే.
-అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మామిడి రైతు, చండ్రుగొండ మండలం, భద్రాద్రి జిల్లా