రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల జోలికి వెళ్లొద్దని, వేలం పాటలు వెంటనే నిలిపివేసి మూగజీవాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సీపీఎం, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీలు చేపట్టడంతోపాటు పలు చోట్ల సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై దాడులు చేయడంతోపాటు అక్రమంగా కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టేకులపల్లిలో ఏపీకేఎం, టీపీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాల్వంచ, ఎర్రుపాలెం, కారేపల్లి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, ఇల్లెందు, జూలూరుపాడు మండలాల్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మలను, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తిరుమలాయపాలెంలో ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఖమ్మం నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
-ఖమ్మం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)