మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం.. ఉన్న ఊరు నుంచి వ్యయ ప్రయాసలకోర్చి 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణం.. రవాణా ఖర్చులు.. దళారులకు ముడుపులు.. అధికారులకు ఆమ్యామ్యా.. ఇంతాజేసి రెవెన్యూ కార్యాలయానికి వెళితే అక్కడే ఉలికే వాడుండడు.. పలికేవాడుండడు.. అక్కడో కిందిస్థాయి ఉద్యోగి ఉంటాడు.. భూరిజిస్ట్రేషన్ గురించి అడిగితే ‘సారు బిజీగా ఉన్నారు..’ అంటాడు.. గంటలు గడుస్తాయి.. పూటలు గడుస్తాయి.. ఆరోజుకు పని కాదు.. తిరిగే మరుసటి రోజు అదే తీరు.. నెలలు గడిచినా అదే బాధ.. మొత్తానికి రైతు బాధ అరణ్య రోదన.. అయితే.. ఇదంతా నాడు..!
మరి నేడో.. భూమి రిజిస్ట్రేషన్ అయినా, మ్యుటేషన్ అయినా.. ‘మీ సేవ’లో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. రెవెన్యూకార్యాలయానికి వెళ్లిన అరగంటలోనే ప్రక్రియ పూర్తి.. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొన్నిరోజుల్లో చేతిలో పట్టా పుస్తకం. అంతేనా.. భూ రికార్డులు ఇక ఆన్లైన్లో భద్రం.. ఒక్కసారి డిజిటలైజ్ అయితే ఇక రికార్డులు మారడం అసంభవం.. భూయజమాని వేలిముద్ర, అతడి మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఉంటే తప్ప అది జరగదు.. ఇదీ ‘ధరణి’ విజయం ! పోర్టల్‌పై సత్తుపల్లి మండలానికి చెందిన రైతుల మనోగతమూ ఒకసారి పరికించండి..!
సత్తుపల్లి, జూన్ 12: కాంగ్రెస్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. భూరికార్డుల నిర్వహణలో దళారుల అవతారంలో రాజకీయ నాయకుల పెత్తనం కొనసాగింది. అధికారులు అక్రమ పద్ధతిలో రైతుల భూములను అప్పనంగా వేరొకరికి కట్టబెట్టారు. అక్రమాలను నివారించి భూరికార్డులు, రిజిస్ట్రేషన్లను డిజిటలైజ్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణి’ అనే పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. దళారులు, అరాచకులకు చెక్‌పెట్టి నిజమైన రైతులకు చట్టబద్ధంగా భూహక్కులు కల్పించారు. నిముషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయిస్తున్నారు. పోర్టల్ రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకుని రైతులు సంబురపడుతున్నారు. 2020లో పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సత్తుపల్లి మండలంలో 4,341 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
గతంలో అగచాట్లు..
రైతులు గతంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. రోజుల తరబడి పడిగాపులు కాసేవారు. తాత్సారాన్ని భరించలేక చివరకు దళారుల వద్దకు వెళ్లేవారు. ఆ దళారులు అధికారులతో మిలాకత్ అయి రైతుల నుంచి డబ్బు గుంజేవారు. సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేవారు. సబ్రిజిస్ట్రార్లు చేసిన తప్పిదాలతో రైతుల మధ్య ఘర్షణలు జరిగేవి. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
నిమిషాల్లో రిజిస్ట్రేషన్..
రైతులు ధరణి ద్వారా ఇప్పుడు సులభంగా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయించుకుంటున్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు ‘మీ సేవా’ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు. ఆ సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి కేవలం 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించుకోవచ్చు. ప్రక్రియ పూర్తయిన కేవలం కొన్నిరోజుల్లోనే రైతుల ఇంటికి పోస్టాఫీస్ ద్వారా పాస్‌పుస్తకం చేరుకుంటున్నది. రిజిస్ట్రేషన్ డిజిటలైజ్ కావడంతో అవినీతికి చెక్ పడింది. భూయజమాని వేలిముద్రలు, మొబైల్‌కు వచ్చిన ఓటీపీతోనే రిజిస్ట్రేషన్ ఆధారపడి ఉండడంతో పారదర్శకంగా వచ్చింది.
సులభంగా రిజిస్ట్రేషన్లు..
రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలో నేను రెండెకరాల భూమి కొనుగోలు చేశా. మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి కేవలం 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నాకు సత్వరం పట్టా అందింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు.
– దాసరి ధరణి, కొనుగోలుదారు, రుద్రాక్షపల్లి, సత్తుపల్లి మండలం
ధరణి విధానం బాగుంది..
గత ప్రభుత్వాల హయాంలో తప్పులతడకగా రికార్డులు ఉండేవి. కొందరు రెవెన్యూ అధికారులు ఒకరి భూములు ఒకరికి మార్చే వీలుండేది. ధరణి రావడంతో రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉండడంతో రైతులకు భరోసా కలిగింది. ఎవరూ ఇష్టం వచ్చినట్లు మార్చకుండా ప్రభుత్వం ధరణి ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇంత మంచి వ్యవస్థ ఉన్న తర్వాత భూమి రికార్డులు ఎక్కడికి పోతాయి. ధరణి విధానాన్ని ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా.
-ఖమ్మంపాటి రాంబాబు, రైతు, రేజర్ల, సత్తుపల్లి మండలం
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పాయి..
గతంలో రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్తే నాలుగైదు సార్లు తిరగాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చాక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు గంటలోనే పూర్తవుతున్నాయి. ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెసోళ్లు ఇంత మంచి వ్యవస్థను రద్దు చేస్తామనడం మంచి పద్ధతి కాదు. పాత పద్ధతిలో రాతలెక్కలు తీసుకువస్తే తిరిగి రైతుల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. పైసా, పలుకుబడి ఉన్నవాళ్లు చెప్పినట్లే పనులవుతాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిని కొనసాగిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– మాదిరాజు స్వరాజ్యలక్ష్మి, రైతు, గంగారం, సత్తుపల్లి మండలం
పాత పద్ధతి వద్దు..
నాకున్న వ్యవసాయ భూ మిలో ఇటీవల రెండెకరాలను విక్రయించా. మీసేవ కేం ద్రంలో స్లాట్ బుక్ చేసుకు న్నా. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ధరణి రాకముందు రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణితో మాకు రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. వ్యయప్రయాసలు త ప్పాయి. ఈ పద్ధతే బాగుంది. పట్టాదారు సంతకం లేనిదే భూమి వేరోటోళ్లకు అమ్మే అవకాశం ఇప్పుడు లేదు. దీంతో పాటు భూమి రికార్డులూ భద్రంగా ఉం టున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణిని ఎత్తివేయాలని కుట్రలు పన్నుతున్నారు. పాత పద్ధతి వస్తే గతంలో మాదిరిగానే మళ్లీ రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉంది. -కొడిమెల అప్పారావు, రైతు, కిష్టారం, సత్తుపల్లి మండలం