అశ్వారావుపేట, జనవరి 10: పామాయిల్ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూడబోయింది. రైతు సంఘం నేతలు అభ్యంతరం చెప్పడంతో వెనుకడుగు వేసింది. ఏటా పామాయిల్ గెలల ధరను ఫార్ములా ప్రకారం చెల్లిస్తుంటారు. ఫార్ములా అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఫార్మూలాను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జీవో జారీ చేయలేదు. కానీ గెలల ధరల చెల్లింపులు మాత్రం కొత్త ఫార్ములా ప్రకారం చెల్లించాలని ఉద్యాన శాఖ అధికారులు, టీఎస్ ఆయిల్‌ఫెడ్ అధికారులు ప్రయత్నించారు. రైతు సంఘం నేతలు గమనించి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత్యంతరం లేక అధికారులు పాత ఫార్మూలా ప్రకారం రైతులకు ధరను చెల్లించారు.
నవంబర్ నెల నుంచి ఆయిల్ ఇయర్‌గా తీసుకుని ఆయిల్‌ఫెడ్ బాధ్యులు, ఉద్యాన శాఖ అధికారులు ధర చెల్లింపునకు ఫార్ములా నిర్ణయిస్తారు. నిరనుడు 19.32 శాతం ఆధారంగా గెలల ధరను అధికారులు చెల్లించారు. ఈ ఏడాది ఫార్ములా 19.02 శాతానికి తగ్గింది. ఈ ఫార్మూలా ప్రకారం గెలల ధర కూడా తగ్గుతుంది. అయితే ఫార్ములా ప్రకటించిన టీఎస్ ఆయిల్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వం నుంచి జీవో జారీ కాకుండానే గెలల ధరను చెల్లించే ప్రయత్నం చేశారు. టన్ను ధర రూ.12,448 చొప్పున చెల్లింపులు మొదలుపెట్టారు. కొత్త ఫార్మూలా ప్రకారం ఒక్కో టన్నుకు రైతులు సుమారు రూ.200 నుంచి రూ.250 వరకు నష్టపోతారు. ప్రభుత్వం జీవో జారీ చేయలేదు కాబట్టి పాత ఫార్ములా ప్రకారం గెలల ధర చెల్లించాలని ఆయిల్‌పాం గ్రోవర్స్ అసోషియేషన్ డిమాండ్ చేయటంతో వెనక్కి తగ్గిన టీఎస్ ఆయిల్‌ఫెడ్.. పాత ఫార్ములా ప్రకారం గెలల ధరను చెల్లించేందుకు అంగీకరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామంద్ర ప్రసాద్ నేతృత్వంలో నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావులను కలిసి పాత ఫార్మూలా ప్రకారం గెలల ధర చెల్లించాలని వినతిపత్రం అందజేశారు.
దీంతో గెలల టన్ను ధరను నిరుడు నవంబర్‌లో రూ.12,619, డిసెంబర్లో రూ.12,627 చొప్పున చెల్లించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్‌లో జరగాల్సిన గెలల ధర నిర్ణాయక సమావేశం ఎన్నికల కారణంగా వాయిదా పడింది. సమావేశాన్ని ఈ ఏడాది జనవరిలో అధికారులు నిర్వహించారు. ఫార్ములాను ప్రకటించినప్పటికీ ఉద్యాన శాఖ నుంచి జీవో విడుదల కాకపోవడంతో కొత్త ఫార్ములా ఇంకా అమల్లోకి రాలేదు. అధికారులు మాత్రం గెలల ధర చెల్లింపులకు ప్రయత్నించారు. కొత్త ఫార్ములాతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని గమనించిన సంఘం నేతలు.. జీవో జారీ కాకుండా కొత్త ఫార్ములాను ఎలా అమలు చేస్తారంటూ నిలదీశారు. రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని కాబట్టి పాత ఫార్ములా ప్రకారమే ధర చెల్లించాలని పట్టుబట్టారు. లేదా ధర తగ్గుతున్న దృష్ట్యా రైతులకు నష్టం లేకుండా ట్రాన్స్పోర్ట్ చార్జీలను పెంచాలని కోరారు. రైతు సంఘం ఒత్తిడితో అధికారులు పాత ఫార్ములా ప్రకారం చెల్లింపులు జరుపుతున్నారు. రవాణా చార్జీలను పెంచిన తర్వాతే కొత్త ఫార్ములాను ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్‌ఫెడ్ అధికారులు అమలు చేస్తారని రైతు సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు నష్టపోకుండా ఆయిల్‌ఫెడ్ అధికారులు ఫార్ములాను అమలు చేయాలని సూచిస్తున్నారు.
రైతులకు గెలల ధర నిర్ణయించేందుకు ఆయిల్‌ఫెడ్ ఫార్మూలాను ప్రకటిస్తుంది. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాతే ఫార్మూలా అమలవుతుంది. కానీ ఆయిల్‌ఫెడ్ అదికారులు జీవో విడుదల కాకుండా రైతులకు ఆర్థిక నష్టం చేకూర్చే విధంగా కొత్త ఫార్మూలా ప్రకారం గెలల ధర చెల్లించాలని ప్రయత్నించారు. ఆ విషయాన్ని ముందుగానే గమనించి సంఘం తరఫున అభ్యంతరం చెప్పడంతో అధికారులు వెనక్కి తగ్గారు. పాత ఫార్మూలా ప్రకారం గెలల ధరను చెల్లిస్తున్నారు. లేకుంటే రైతులు టన్నుకు రూ.200 నుంచి రూ.250 వరకు నష్టపోయే పరిస్థితి ఉండేది.
ఈ ఏడాది గెలల ధర చెల్లింపునకు సంస్థ అధికారులు 19.02 శాతం ప్రకారం ఫార్మూలాను నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. రైతులకు గెలల ధర చెల్లింపులో ఆలస్యం కావడం వల్ల కొత్త ఫార్మూలా ప్రకారం ధర చెల్లించడానికి చర్యలు తీసుకున్నాం. కానీ రైతు సంఘం నాయకుల అభ్యంతరంతో పాత ఫార్మూలా ప్రకారం గెలల ధరను చెల్లిస్తున్నాం. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాతే కొత్త ఫార్మూలాను అమలు చేస్తాం.