వైరాటౌన్/ కూసుమంచి/ తిరుమలాయపాలెం, ఆగస్టు 23 : ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా 600మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
వైరా నియోజకవర్గ కేంద్రంలో మిషన్ భగీరధ జేఏసీ రాష్ట్ర నాయకుడు మద్దెల రవి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పనిచేస్తున్న వారికి 13నెలలుగా, మిషన్ భగీరథ కార్మికులకు మూడునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమ్మెలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కూసుమంచిలో సమ్మె చేస్తున్న కార్మికుల వద్దకు అధికారులు వచ్చి వారంరోజుల్లో జీతాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరారు. జీతాల కోసం ఎన్నో దఫాలుగా అడిగినా పట్టించుకోలేదని యూనియన్ బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు సంఘీభావం తెలిపిన వారిలో ఐఎన్టీయూసీ డివిజన్ బాధ్యులు మధుసూదన్‌రెడ్డి, పుల్లారెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొత్తా పుల్లారెడ్డి, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు జక్కుల యాదగిరి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల అధ్యక్షులు రంజిత్‌నాయక్, దోమల భరత్, సంఘం నాయకులు పడిశాల ఏడుకొండలు, తంగెళ్ల మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
పాలేరు రిజర్వాయర్ సమీపంలోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద పాలేరు నియోజకవర్గంలోని ప్రాంతాలకు చెందిన కార్మికులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ ఎస్ఈ భాస్కర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపారు. రెండు విడతల్లో పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.