Kothagudem | కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 29 : కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజంబస్తీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, ప్రతీరోజు నీటిని విడుదల చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు బాలశెట్టి సత్యభామ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఆమె ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతను కలిసి వినతిపత్రం అందజేసి నీటి ఇబ్బందులను, సమస్యను వివరించారు. వార్డుల్లో రెండు రోజుకొకసారి నీటిని సరఫరా చేసేవారని ప్రస్తుతం ఐదురోజులైన వీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో ప్రజలు తాగునీటికి, గృహ అవసరాలకు నీటికి తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని తెలియజేశారు. వార్డులో 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వేసవికాలంలో మంచినీటి సరఫరాపై ప్రజలు నిలదీస్తున్నారని సమాధానం చెప్పలేకపోతున్నానని, వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన కమిషనర్ మంచినీటి పైపులైన్‌కు మరమ్మతులు జరుగుతున్నాయని నీటి సమస్యను వీలైనంత తొందరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.