భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన పథకాలన్నింటినీ నీరుగార్చుతూ వస్తున్నది. తాజాగా మిషన్ భగీరథపైనా రేవంత్ సర్కారు కన్ను పడింది. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకాన్ని పక్కకు పెట్టినట్లు స్పష్టమవుతున్నది. నల్లాలు, పైపులు సిద్ధంగా ఉన్న చోట కూడా వాటికి కనెక్షన్లు ఇవ్వడం లేదు.
ఇంటి ముంగిట నల్లా ఉన్న పేదలు.. శుద్ధజలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఓ వైపు పేదల గొంతెండుతున్నా, మరోవైపు భగీరథ పరికరాలు మట్టిలో కలిసిపోతున్నా స్పందించకుండా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. పైగా, భద్రాద్రి జిల్లాలోని 21 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే, అధికారుల లెక్కల్లోకి రాని గ్రామాలు ఇంకా అనేకం ఉన్నాయి.
అయితే, మిషన్ భగీరథ పేరును ప్రస్తావించినా, ఆ శుద్ధజలాలను చూసినా, దప్పిక తీరేలా తాగినా గత ముఖ్యమంత్రి కేసీఆరే ప్రజలకు గుర్తుకొస్తారని భావించిన ప్రభుత్వం.. క్రమంగా ఈ పథక ఆనవాళ్లు లేకుండా చేసేలా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే ఇప్పటికే సిద్ధంగా ఉన్న పైపులకు కూడా కనెక్షన్లు ఇవ్వడం లేదు. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్నా, మారుమూల గ్రామాల్లో ప్రజల గొంతు ఎండుతున్నా కనీసం స్పందించడం లేదు. అయితే, తాగునీటి సమస్యపై సాక్షాత్తూ కలెక్టర్ కూడా ఇటీవల కీలక ప్రకటన చేశారు. తాగునీటి సమస్య ఉంటే నేరుగా ఫోన్ చేయాలంటూ ఓ ఫోన్ నంబరును విడుదల చేశారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో ఏకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్రస్థాయిలోనూ ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయడం గమనార్హం.
అది మారుమూల గ్రామం ఎర్రబోరు. దుమ్ముగూడెం మండలం పెదకమలాపురం గ్రామ పంచాయతీలోనిది ఈ చిన్న పల్లె. అక్కడ 400 మంది జీవిస్తున్నారు. అందరూ కూలీలే. వారికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. చేతిపంపులే వారికి దిక్కుగా ఉన్నాయి. గత ప్రభుత్వం వేసిన మిషన్ భగీరథ నల్లాలకు కనీసం కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు.
ఆ నల్లాలు మట్టిలో కలిసిపోతున్నా కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికే వేసవి సమీపించింది. ఎండలు మరికొంత ముదిరితే గ్రామస్తులు తాగునీటి కోసం అల్లాడిపోతారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీస మాత్రంగా కూడా కనికరం చూపడం లేదు. అయితే, ఇలాంటి గ్రామాలు జిల్లాలో ఇంకా అనేకం ఉండడం గమనార్హం. కాగా.. పెదకమలాపురం గ్రామంలో భగీరథ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అన్ని కుటుంబాలకు సరిపోవడం లేదు. కొద్దిమొత్తంగా సరఫరా చేసి నిలిపివేస్తున్నారు. ఇక ఇదే మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద అసలు భగీరథ నీటినే సరఫరా చేయడం లేదు.
వేసవి రాకముందే భద్రాద్రి జిల్లాను తాగునీటి సమస్య వెంటాడుతోంది. కేవలం మిషన్ భగీరథ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుండడం వల్లే సమస్య జఠిలమవుతున్నది. భద్రాద్రి జిల్లాలో ఉన్న 481 గ్రామ పంచాయతీలకుగాను కేవలం 21 గ్రామ పంచాయతీల్లోనే తాగునీటి సమస్య ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. ఇక ఆయా గ్రామాల్లో ఏకంగా 700 చేతిపంపుల నుంచి నీళ్లు కూడా రావట్లేదనే విషయాన్ని గణాంకాలు వెల్లడిస్తుండడం గమనార్హం.
ఆవాస గ్రామాలకు తాగునీరు అందని ద్రాక్షే..
ఇక జిల్లాలోని ఆవాస గ్రామాలకు కూడా తాగునీరు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గుండాల మండలం బాటన్ననగర్, ఆళ్లపల్లి మండలం అడవిరామవరం, టేకులపల్లి మండలం మంగల్ తండా, సుజాతనగర్ మండలం బాలాజీనగర్ సహా ములకలపల్లి మండలంలోని మరో రెండు గ్రామాల్లో మిషన్ భగీరథ నల్లాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దుమ్ముగూడెం మండలంలోని 15 గ్రామాల్లో రెండుమూడు బిందెలకు మించి నీటిని ఇవ్వడం లేదు.
ట్యాంకుకు నీళ్లు సరిగ్గా ఎక్కడం లేదు. దీంతో కొన్నిసార్లు ఒక్కొక్కరికీ రెండు బిందెలు, లేదంటే ఒక్కో కుటుంబానికి రెండు బిందెల చొప్పున భగీరథ నీళ్లు ఇస్తున్నారు. ఆ నీళ్లు ఇంట్లో అందరికీ సరిపోవడం లేదు. దీంతో మా ఊరిలో ట్యాంకు ఉన్నప్పటికీ ఉపయోగపడట్లేదు. ఈ మండలంలో గోదావరి ఉన్నా మాకు గోదారి నీరు రావడం లేదు.
-తునికి రాంబాబు, పెదకమలాపురం, దుమ్ముగూడెం మండలం
మా ఇంట్లో నల్లా వేశారు. కానీ.. ఆ నల్లాకు ఇంత వరకూ నీళ్లు సరఫరా చేయట్లేదు. మా ఊరిలో అందరమూ కూలి పనులకు వెళ్లే వాళ్లమే. గ్రామంలో ఉన్న చేతి పంపుల నుంచే తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎండాకాలం వస్తే ఆ చేతిపంపుల్లో కూడా నీళ్లు తక్కువగా వస్తాయి. మా ఊరిలో భగీరథ ట్యాంకు కట్టినప్పటికీ నీళ్లు మాత్రం ఇవ్వడం లేదు.
-కోటమ్మ, ఎర్రబోరు, దుమ్ముగూడెం మండలం
భద్రాద్రి జిల్లాలో 481 పంచాయతీల్లోని 21 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. అది కూడా ఆవాస గ్రామాల్లోనే. ఎర్రబోరు గ్రామంలోని ట్యాంకుకు నీరు ఎక్కడం లేదంటే అది మా సమస్య కాదు. గ్రిడ్ వాళ్లు చేయాల్సిన పని. మేం అన్ని గ్రామాలకూ పైపులైన్లు వేశాం. కొన్నిచోట్ల నీరు రావడం లేదంటే అది స్థానిక సమస్య. పంచాయతీ వాళ్లు సరిచేస్తారు.
-తిరుమలేశ్, ఈఈ, మిషన్ భగీరథ, భద్రాద్రి