భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : అది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామం. 18 కుటుంబాలు 55 మంది జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. అదే.. చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీలోని చండ్రుకుంట. ఇంత చిన్న గ్రామాన్ని తాగునీటి సమస్య మాత్రం వెంటాడుతోంది. మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా ఈ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.
భగీరథ పైపులకు లీకులు ఉన్నా కనీసం మరమ్మతులు చేసిన పాపానపోలేదు. దీంతో గ్రామానికి పెద్దగా నీరు రావడం లేదు. ఆ నీళ్లతో ఒక్కో బిందె నిండేందుకు అరగంట పడుతోందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు ఇదే గ్రామానికి నీళ్లు అందించేందుకు సింగరేణి ఏర్పాటు చేసిన సోలార్ బోరు పైపులైన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కనీసం దాని నుంచి నీళ్లు కూడా సరఫరా కావడం లేదు. నీటి సమస్య కారణంగా వృద్ధులు స్నానం చేసేందుకు కూడా వెనుకాడుతున్నారంటే ఆ గ్రామంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వేసవి ప్రారంభంలోనే భద్రాద్రి జిల్లాను తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. తాగునీటి సమస్యను సమూలంగా నిర్మూలించాలని, ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలని గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతో మంచి ఫలితాలనిచ్చాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలు అందాయి. కానీ.. ఏడాదిన్నర క్రితం వచ్చిన కాంగ్రెస్ సర్కారు మిషన్ భగీరథ పథకాన్ని నీరుగారుస్తోంది. కనీసం మరమ్మతులపై కూడా దృష్టిసారించడం లేదు.
దీంతో ఆవాస గ్రామాలకు తాగునీరు అందని ద్రాక్షగానే మిగులుతోంది. భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలుండగా.. వాటిల్లో ప్రసుత్తం 21 గ్రామ పంచాయతీల్లో తీవ్రమైన తాగునీటి సమస్య కన్పిస్తోంది. జిల్లాలోని సుమారు 700 చేతిపంపుల్లో నీళ్లు రావడం లేదు. ఫలితంగా వాటిపై ఆధారపడిన ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఓవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు నీళ్లు అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. కొత్త బోర్లు వేయడం లేదు. పైగా, మరమ్మతులపై కూడా పెద్దగా దృష్టిపెట్టడం లేదు.
మండల కేంద్రాల్లో తాగునీటి ఎద్దడి ఇలా ఉంటే.. ఆవాస ప్రాంతాల్లో అయితే తాగునీళ్లు అందని ద్రాక్షగానే మారాయి. మరమ్మతులకు గురైన చేతిపంపులు అలంకారప్రాయంగా కన్పిస్తుండడం సమస్యకు అద్దంపడుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం పాతూరు గ్రామంలో నీటి సమస్య అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
గుండాల మండలం బాటన్ననగర్, ఆళ్లపల్లి మండలం అడవిరామవరం, టేకులపల్లి మండలం మంగల్‌తండా, సుజాతనగర్ మండల కేంద్రలోని బాలాజీ నగర్‌తోపాటు ములకలపల్లి మండలంలోని మరో రెండు గ్రామాల్లో వేసిన నల్లాలకు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కనీసం నీటిని కూడా సరఫరా చేయడం లేదు. దుమ్ముగూడెం మండలం ఎర్రబోరులో గ్రామస్తులకు ట్యాంకు నుంచి నీళ్లు అందని పరిస్థితి ఏర్పడింది. అయితే వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా ఉంటే.. మండు వేసవిలో ఎలా ఉంటుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీదేవిపల్లి, మార్చి 22 : లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పాతూరులో తాగునీటి ఎద్దడి తీవ్రంగానే ఉంది. ఈ గ్రామంలో 63 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటి కోసం ఒక విద్యుత్ బోరు, ఒక చేతిపంపు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కరెంటు ఉన్నప్పుడే బోరు నుంచి ఉదయం ఒక గంట సేపు నీళ్లు ఇస్తారు. సాయంత్రం మరో అరగంట ఇస్తారు. ఇంతకొద్ది సమయంలో ఇచ్చే నీళ్లు గ్రామస్తులకు సరిపోవడం లేదు. ఒకవేళ కరెంటు లేకపోతే ఆ నీళ్లు కూడా రానట్టే. ప్రత్యామ్నాయంగా ఉన్న చేతిపంపు నుంచి కూడా నీళ్లు రావడం లేదు.
మా ఊరు చిన్నదే అయినా తాగునీటి సమస్య పెద్దగా ఉంది. పైపులు లీకవుతున్న కారణంగా నల్లాల్లోకి నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. ట్యాంకులో నీరు ఉన్నా ఇళ్లకు సప్లయి అయ్యే పరిస్థితి లేదు. తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. బడి దగ్గర ఉన్న చేతి పంపు వద్దకు వెళ్తున్నాం. ఊర్లో ఉన్న ఇంకో చేతి పంపు మరమ్మతులకు గురైంది.
-రజితకుమారి, చండ్రుకుంట, చుంచుపల్లి
మా గ్రామంలో ఒకే ఒక్క విద్యుత్ బోరు ఉంది. దాని ద్వారా మా గ్రామంలో తాగునీటి సమస్య తీరడం లేదు. గంట వదిలినా ఆ నీళ్లు అందరికీ సరిపడా రావడం లేదు. కనీసం గ్రామంలోని చేతిపంపులకైనా ప్రభుత్వం మరమ్మతులు చేయించాలి. ట్యాంకు నిర్మించాలి. అప్పుడే నీళ్లు సరిపోతాయి.
-చీమల సతీశ్, పాతూరు, లక్ష్మీదేవిపల్లి
మా గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం సింగరేణి అధికారులు గతంలో సోలార్ బోర్ వేశారు. కానీ.. ఇప్పుడు అక్కడి నుంచి కూడా నీళ్లు రావడం లేదు. గ్రామంలో ఉన్నది ఒకటే నల్లా. ఇంకో నల్లా పనిచేయడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు తక్కువగా వస్తున్నాయని సోలార్ బోరు వద్దకు వెళ్తున్నాం. అక్కడ కూడా చిన్న ధారే వస్తోంది. పనులకు వెళ్లకుండా పంపు దగ్గరే ఉండాల్సి వస్తోంది.
-వెంకటేశ్వర్లు, చండ్రుకుంట, చుంచుపల్లి