జూలూరుపాడు, మే 30: తాగునీటి కోసం తండ్లాటలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలోనూ ఇదే నిరసన వ్యక్తమైంది. ‘20 రోజులుగా తాగునీళ్లు ఇవ్వకుంటే ఎలా?’ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
దీంతో గ్రామస్తులందరూ పంచాయతీ అధికారులను కలిశారు. తాగునీరు అందకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు. నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు లేవు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలతో ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదని, పంచాయతీ అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు.
గ్రామంలోని విద్యుత్ మోటర్లు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని, పల్లెల్లోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కాగా, ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై జీవన్‌రాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు సర్ది చెప్పారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో గామస్తులు ఆందోళన విరమించారు.