వానకాలంలోనూ తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు తంట్లాడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలోని పలు కాలనీల వాసులు అవస్థలు పడుతున్నారు. ఖాళీ బిందెలు పట్టుకొని చేతి పంపు వద్దకు చేరుకున్న గిరిజన మహిళలు సోమవారం నిరసన తెలిపారు.
తాగునీరు అందించేందుకు గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉండడంతో పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ నీటిని వదులుతున్నా.. కొన్ని వీధులకు మూడు రోజులుగా నీళ్లు రావడం లేదని తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలోనే నీటి ట్యాంకు ఉన్నా.. పంపులు రాకపోవడంతో చేతి పంపులను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు గిరిజన మహిళలు ఆరోపించారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ పంపు నీళ్లు వచ్చే విధంగా చూడాలని కోరారు.
-టేకులపల్లి, సెప్టెంబర్ 30