పల్లెల్లో దాహం కేకలు మొదలయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా కన్నీటి కష్టాలే దర్శనమిస్తున్నాయి. చాలావరకు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందడం లేదు. కొన్నిచోట్ల అరకొరగా అందుతున్నప్పటికీ వేసవికాలం కావడంతో అవీ ఎటూ సరిపోవడం లేదు. అక్కడక్కడ ఉన్న చేతిపంపులు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. మహిళలు పనులు మానుకొని నల్లాల వద్ద గంటలకొద్దీ నీటి కోసం వేచిచూడాల్సిన దుస్థితి ఉంది.
నీటి కోసం ఇంతగా అల్లాడిపోతున్నా ఆర్‌డబ్ల్యూస్, ఇంజినీరింగ్, పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి కష్టాలను ఎదుర్కోవడం ఎలా అని తెగ భయపడుతున్నారు. తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అన్ని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో అధికారులను వేడుకుంటున్నారు. అయితే గత కేసీఆర్ పదేండ్ల పాలనలో తాగునీటి తంటాలు ఎరుగమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మొదలయ్యాయని పల్లె జనం అభిప్రాయపడడం గమనార్హం. – భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కరకగూడెం, మార్చి 28
“అది సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామం. 1,500 కుటుంబాలు ఉంటాయి. అక్కడ ఉన్న మూడు బజార్లలో ఒక బజారుకు అసలు నీరు రాదు. 200 ఇండ్లకు తాగునీరు రావడం లేదంటే నమ్మాలి. ఇండ్లకు పైపులైన్లు వేసి ఉన్నా నల్లా కలెక్షన్లు మాత్రం మొత్తం వంగిపోయి, పడిపోయి ఉన్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ వేసినప్పటి నుంచీ చుక్కనీరు రాలేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. చేతిపంపులు ఉన్నా పనిచేయడం లేదు. మిగతా రెండు బజార్లకు కూడా స్థానిక వాటర్ ట్యాంకు ద్వారా మాత్రమే నీరు వస్తున్నాయని చెబుతున్నారు.”
అసలే మండే ఎండలు. నీటివాడకం ఎక్కువగా ఉండేది ఇప్పుడే. ఇలాంటి సమయంలో గ్రామాల్లో నీటి సరఫరా లేకపోతే ప్రజలు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలావరకు గ్రామాల్లో తాగునీటి సమస్య తాండవిస్తున్నది. చుంచుపల్లి మండలం 4వ ఇైంక్లెన్లో తాగునీటి సమస్య ఉండడం వల్ల గంటలకొద్దీ నల్లాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సుజాతనగర్ మండల కేంద్రం బాలాజీనగర్‌లో పైపులైన్ వేసి నల్లాలు బిగించినా కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నీరు రావడం లేదు. దుమ్ముగూడెం మండలం ఎర్రబోరు గ్రామంలో ట్యాంకు ఉన్నా అక్కడకు నీరు ఎక్కకపోవడంతో సమస్య వెంటాడుతున్నది. పాల్వంచ మండలం రాజీవ్‌నగర్‌లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లెందు మండలం సీఎస్పీ పంచాయతీ రాజీవ్‌నగర్‌లో తాగునీటి సమస్య ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో సీపీఎం నాయకులు నిరసన తెలిపిన దాఖలాలు ఉన్నాయి.
కరకగూడెం మండలంలో తాగునీరు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో బావులు, బోరింగ్ నీటిని తాగుతూ ప్రజలు రోగాలపాలవుతున్నారు. మండలంలోని కొత్తగూడెం, చొప్పాల పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో వందల మంది ప్రజలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో బావులు, బోర్ల నీటిని వాడుతున్నారు. కొంతమందికి నల్లాలు బిగించి కనీసం కనెక్షన్ కూడా ఇవ్వకపోవడంతో సురక్షిత నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన మినరల్ ప్లాంట్ల నిర్వాహకులు 20 లీటర్ల నీటిని రూ.20 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు, పాలకులు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు అంటున్నారు.
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీరు సమయానికి వచ్చేవి. కానీ.. ప్రభుత్వం మారిన తరువాత గుక్కెడు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నాం. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో బావి నీరు దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుని తాగుతున్నాం. బిందెలతో నీరు మోయాలంటే యాష్టకొస్తున్నది. బావి నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
– మంకిడి సుమలత, కొత్తగూడెం గ్రామం, కరకగూడెం మండలం
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు.. కానీ.. మిషన్ భగీరథ నీరు మాత్రం రావడం లేదు. బావి, చేతిపంపు నీరు తెచ్చుకొని తాగుతున్నాం.. అపరిశుభ్ర నీరు తాగడం వల్ల రోగాలబారిన పడుతున్నాం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు. దయచేసి అధికారులు స్పందించి తీవ్రమైన తాగునీటి ఎద్దడిని నివారించాలని కోరుతున్నాం.
– నరసింహారావు, కొత్తగూడెం గ్రామం, కరకగూడెం మండలం
మా గోసను అర్థం చేసుకుని మా ఊర్లో తాగునీటి సమస్యను పరిష్కరించండి. నల్లాలు పెట్టారు.. కనెక్షన్లు ఇవ్వలేదు. మిషన్ భగీరథ నీరు రాక నానా అవస్థలు పడుతున్నాం. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంకా ఎండలు ఎక్కువైతే మా పరిస్థితి భయానకమే.
– నాలి రాధ, పాయంవారిగుంపు, కరకగూడెం మండలం
భగీరథ కాదు కదా ఏ నీరూ రావడం లేదు. చేతిపంపు మాకు దూరంగా ఉంది. నల్లా ఉన్నా దాని నుం చి నీరొచ్చిన పాపాన లేదు. ఇంట్లో మోటారు ఉండడం వల్ల ఆ నీరు వాడుకుంటు న్నాం. తాగేనీరు భగీరథ ద్వారా వస్తుందని చూస్తు న్నాం.. అయినా ఇప్పటివరకు పైపులైన్లో చుక్కనీరు రాలేదు. మా బజారులో ఎవరికీ నీరు రావడం లేదు.
– నల్లగొర్ల రాంబాయమ్మ, సింగభూపాలెం, సుజాతనగర్ మండలం
మా ఊర్లో రెండు బజార్లకు నీళ్లు వస్తాయి. కానీ.. మాకు మాత్రం రావు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఏం చేయాలో అర్థంకావడం లేదు. పంచాయతీ ఆఫీసు పక్కనే మా బజారు ఉంటది. నీటి కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం.
– నల్లగొర్ల వెంకటమ్మ, గ్రామస్తురాలు, సింగభూపాలెం
మా నల్లాలో నీరు రావడం లేదు. పక్కనే ఉన్న గుడి మోటరు దగ్గర నీరు పట్టుకుంటున్న. ముసలోన్ని నేను ఎక్కడికి పోవాలి. పంపుల వద్దకు పోయి నడిచే ఓపిక లేదు. గుడివాళ్లను అడిగితే నీరు పట్టుకోమన్నరు. మా ఊళ్లో ట్యాంకు ఎందుకు కట్టారో తెలియదు. నీరు ఎందుకు రావడం లేదో కూడా ఎవరూ చెప్పడం లేదు.
– రాసబంటి మల్లయ్య, వృద్ధుడు, సింగభూపాలెం