భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసినందున పల్లెపోరు కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందస్తుగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. వారం రోజుల ముందుగానే డాఫ్ట్ విడుదల చేయాల్సి ఉండగా.. రాష్ట్రవాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది.
దీంతో శుక్రవారం డ్రాఫ్ట్ విడుదల చేయడానికి భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి జిల్లాలో 481 పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆయా పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పంచాయతీల్లో నిధుల లేమి అంశం ప్రత్యేకాధికారులకు తలనొప్పిగా మారడంతో అధికారులు అటువైపు చూడడం లేదు. కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తయారు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేశారు. 481 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఆయా గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డుల్లో ఉంచనున్నారు.
దీంతోపాటు మండల పరిషత్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతారు. జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లా కార్యాలయంలో సిబ్బందితో డ్రాఫ్ట్‌పై కసరత్తు చేసి తుదిరూపునకు తీసుకొచ్చారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14 నుంచి 21 వరకు పంచాయతీ కార్యాలయాల్లో స్వీకరించడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు.
ఈ నెల 14 నుంచి అభ్యంతరాలు తీసుకున్న తర్వాత 26న డీపీవో వాటిని పరిష్కరిస్తారు. ఆ తరువాత తుది జాబితాను పూర్తిచేసి 28న ప్రకటిస్తారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు.